VH: రేవంత్‌ని సీఎం చేద్దామన్నందుకు భట్టి పగబట్టాడు
VH: సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు కన్నీరుపెట్టుకున్నారు. తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న సమయంలో రేవంత్ రెడ్డిని (Revanth Reddy) తెలంగాణ ముఖ్యమంత్రిని చేద్దాం అన్నందుకు ఈరోజు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) తనపై పగబట్టాడని అన్నారు. ఆ కోపంతోనే తనకు ఖమ్మం ఎంపీ టికెట్ రానివ్వకుండా అడ్డుకుంటున్నాడని ఆరోపించారు. భట్టిని సీఎల్పీ నేతగా, పీసీసీగా చేసింది తానే అని అవేమీ గుర్తుపెట్టుకోకుండా ఈరోజు తనపై కక్ష రాజకీయం చేస్తున్నాడని ఆరోపించారు. రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర అంటున్నారు కానీ తనకు మాత్రం న్యాయం చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేసారు.
“””” నేను కింది స్థాయి నుంచి వచ్చాను. రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ దయవల్ల రాజకీయాల్లో ఎదిగాను. పదేళ్ల నుంచి నాకు చెప్పుకోదగ్గ పదవి లేదు. కానీ ఇప్పటికీ ప్రజల్లో నాపై అభిమానం ఉంది. ఇప్పటికీ నేను ఎక్కడికి వెళ్లినా పలుకుతారు. ఖమ్మం ఎంపీ సీటు నాకు ఇస్తే నేను కచ్చితంగా గెలుస్తాను. కానీ మల్లు భట్టి విక్రమార్క నాకు ఆ సీటు రానివ్వకుండా చేస్తున్నారు. ఇందుకు కారణం రేవంత్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రిని చేద్దాం అని నేను అనడమే. అది భట్టికి నచ్చలేదు. రేవంత్ తిరిగి కష్టపడ్డాడు కాబట్టి ఆయనకే సీఎం పదవి దక్కాలని అనడంలో తప్పేముంది?
ఎందుకు నా మీద అంత కక్ష? నేను భట్టికి రాజకీయ భిక్ష పెట్టాను. అలాంటి నాపైనే ఎందుకు ఇంత కోపం? ఖమ్మం ప్రజలే నన్ను పోటీ చేయమంటున్నారు. బీసీలకు టికెట్లు ఇవ్వరా? బీసీలకు న్యాయం జరగదా? వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పీసీసీని చేసింది కూడా నేనే. అలాంటిది ఈరోజు ఆయన బిడ్డ వైఎస్ షర్మిళకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ పదవిని ఇచ్చారు. మరి నాకు ఏమీ ఇవ్వరా? నేను ఇవేమీ మనసులో పెట్టుకోను. అన్నీ దేవుడే చూసుకుంటాడు “”” అని కన్నీరుపెట్టుకున్నారు వీహెచ్