TDP, జనసేనలతో పొత్తుపై బీజేపీ వైఖరి ఇదే.. ఏం జరుగుతుందో!

vijayawada: ఏపీలో వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అన్ని కలిసి వస్తే.. జనసేన పార్టీ BJP, TDPతో కలిసి పొత్తులతో ముందుకు వెళ్లనున్నట్లు పవన్‌కల్యాణ్‌(pawan kalyan) అన్నారు. టీడీపీ సైతం బీజేపీతో కలిసి నడవాలని భావిస్తోంది. చంద్రబాబు సైతం ప్రధాని మోదీని అవకాశం వచ్చినప్పుడల్లా పొగుడుతున్నారు. ఇక ఏపీ సీఎం జగన్‌ను ఎదుర్కోవాలంటే.. ఆయనపై ఉన్న కేసులపై విచారణ సాగిస్తే చాలు. దీంతో కేంద్రం అండ కావాలని జనసేన, టీడీపీ భావిస్తున్నాయి. కానీ బీజేపీ మాత్రం ఈ సారి ఎన్నికల్లో కాకపోయినా.. 2029లోనైనా అధికారం చేజిక్కించుకునేలా ప్రణాళికలు రచిస్తోంది.

ఈసారి ఎన్నికల్లో బీజేపీ-జనసేన పొత్తుతో వెళ్లడం వల్ల .. టీడీపీ పతనం అవుతుందని.. అప్పుడు ప్రతిపక్ష హోదాను పొందాలని బీజేపీ పక్కాప్లాన్‌ సిద్దం చేసుకుంది. అయితే ఈ లెక్కలన్నీ అంత సులువు కాదు. బీజేపీని కలుపుకుని జనసేన ఎన్నికలకు వెళ్తే.. ఒకటి రెండు సీట్లు తప్ప.. మరెక్కడా గెలవదు. ఇది ఆ పార్టీకి పెద్దదెబ్బ. మరోవైపు బీజేపీ జనసేన పొత్తు ఉన్నప్పటికీ పవన్‌ను ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ హామీ ఇవ్వట్లేదు. ఈ తరుణంలో బీజేపీ పవన్‌కల్యాణ్‌ను వదిలేసి.. ఒంటరిగానో.. లేదా ఇతర పార్టీలతో కలిసి వెళ్లినా ఆశ్చర్యం లేదు. బీహార్‌లో నితీష్‌కుమార్‌ను బీజేపీ అలానే వదిలేసింది. ఈక్రమంలో చివరికి నష్టపోయేది జనసేన మాత్రమే అని గ్రహించిన పవన్‌.. టీడీపీని వదులుకునేందుకు ససేమిరా అంటున్నారు. అలాగని కేంద్రానికి నో చెప్పలేని స్థితిలో ఉన్నారు. అయినప్పటికీ.. టీడీపీతో పొత్తుకోసం బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించే పనిలో పవన్‌ ఉన్నారు.

ఇక పొత్తుల అంశంపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి బీజేపీ, జనసేన మాత్రం కలిసే ఉన్నాయని తెలిపారు. బీజేపీ కలిసి రాని పక్షంలో టీడీపీ, జనసేన మాత్రం పొత్తులతో ఎన్నికలకు వెళ్తుందని పవన్‌ మాటల్లో తెలుస్తోంది.