Telangana Elections: ఈ ఎన్నికల్లో కనిపించని సమవుజ్జీలు..!
Telangana elections: తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బరిలోకి దిగిన పార్టీలు ఈసారి గెలుపు గుర్రాలకు, వయసులో ఉన్నవారికి మాత్రమే టికెట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ చక్రం తిప్పిన సమవుజ్జీలకు టికెట్లు ఇవ్వలేదు. దాదాపు ఏడు మంది సీనియర్ నాయకులకు వారి పార్టీలు టికెట్లు ఇవ్వకపోవడంతో వారు ఎంతో బాధపడ్డారు. కొందరు రాజీనామాలు చేసి వేరే పార్టీలో చేరగా మరికొందరు పార్టీ కార్యక్రమాలకు హాజరుకాకుండా దూరంగా ఉంటున్నారు.
జానా రెడ్డి (jana reddy)
కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతల్లో జానా రెడ్డి ఒకరు. 1978లో నల్లగొండ జిల్లాలోని చలకుర్తి నియోజకవర్గం నుంచి జనతా పార్టీ తరఫున పోటీ చేసారు.. అలా ఆయన రాజకీయ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత ఆయన తెలుగు దేశం పార్టీలోకి వెళ్లారు. ఆ తర్వాత 1989లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 వరకు ఆయన గెలుస్తూనే ఉన్నారు. 2009లో డీలిమిటేషన్ కారణంగా చలకుర్తి నియోజకవర్గాన్ని తీసేసి దానిని నాగార్జున సాగర్‌గా మార్చేసారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి ఆయన కుమారుడు జయవీర్ రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు.
పొన్నాల లక్ష్మయ్య (ponnala lakshmaiah)
కాంగ్రెస్ పార్టీలోని మరో సీనియర్ నేత అయిన పొన్నాల లక్ష్మయ్య ఇటీవల రాజీనామా చేసి BRS పార్టీలో చేరారు. ఆయన అడిగిన జనగామ టికెట్ ఇవ్వనందుకు చిన్నబుచ్చుకున్నారు. ఎంతో కాలంగా పార్టీలో ఉంటే తనకు టికెట్ ఇవ్వకుండా అవమానించారని బాధపడ్డారు. దాంతో ఆయన్ను BRS పార్టీ అక్కున చేర్చుకుంది. అయితే ఈసారి ఎన్నికల్లో టికెట్ మాత్రం ఇవ్వలేం కానీ మంచి పొజిషన్‌ను మాత్రం కల్పిస్తామని చెప్పింది.
నాగం జనార్ధన్ రెడ్డి (nagam janardhan reddy)
కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ టికెట్ ఇవ్వనందుకు ఆయన అలిగారు. వెంటనే పార్టీకి రాజీనామా చేసి BRS పార్టీలో చేరారు. 1983లో తెలుగు దేశం పార్టీ (TDP) ద్వారా తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టిన జనార్ధన్ రెడ్డి.. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేగా పలుమార్లు నెగ్గారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఆయన గెలిచారు. రాష్ట్రం విడిపోయాక ఆయన BJPలోకి వెళ్లి ఆ తర్వాత కాంగ్రెస్‌కు వచ్చారు.
గీతా రెడ్డి (geeta reddy)
పవర్‌ఫుల్ మహిళా రాజకీయవేత్తల్లో గీతా రెడ్డి ఒకరు. 1989లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి గెలిచిన గీతా రెడ్డి ఆ తర్వాత జహీరాబాద్‌ను తన నియోజకవర్గంగా మార్చుకున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె అనారోగ్య సమస్యల కారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
డీకే అరుణ (dk aruna)
మరో లేడీ ఫైర్ బ్రాండ్ అయిన డీకే అరుణ కూడా ఈ సారి పోటీ నుంచి దూరంగా ఉన్నారు. 1999లో కాంగ్రెస్ నుంచి గద్వాల్‌లో పోటీ చేసి గెలిచిన అరుణ ఆ తర్వాత 2004లో సమాజ్‌వాది పార్టీకి వెళ్లారు. 2009, 2014 ఎన్నికల్లో గెలిచారు కానీ 2019లో మాత్రం ఓడిపోయారు. 2019లో BJPలో చేరిన అరుణ ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు.
చిన్నా రెడ్డి (chinna reddy)
వనపర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున చిన్నా రెడ్డి పోటీ చేయాల్సి ఉంది. కానీ ఆయనకు టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో నాలుగు సార్లు వనపర్తి ఎమ్మెల్యేగా గెలిచిన చిన్నా రెడ్డి ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో ఓడిపోయారు.
కిషన్ రెడ్డి (kishan reddy)
రాష్ట్ర అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు తీసుకున్నారు కిషన్ రెడ్డి. అంబర్‌పేట్‌లో 2018 ఎన్నికల్లో ఓడిపోయిన కిషన్ రెడ్డి 2019లో లోక్ సభ ఎన్నికల్లో గెలిచారు. ఈసారి ఆయన పోటీకి దూరంగా ఉన్నారు.
పట్నం మహేందర్ రెడ్డి (patnam mahendar reddy)
ఈసారి పట్నం మహేందర్ రెడ్డి కూడా పోటీకి దూరం అయ్యారు. ఆయన సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి కొడంగళ్ నుంచి పోటీ చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గంలో రోహిత్ రెడ్డి అనే కొత్త అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత మహేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ వర్గాలు ఎక్కడ ఆయన్ను తమ పార్టీలోకి లాక్కుంటాయో అన్న అనుమానంతో ముందుగానే BRS పార్టీ ఆయనకు మంత్రి పదవి కేటాయించింది.