Rahul Gandhi: ఎన్ని వ్యతిరేక తీర్పులో.. అన్ని ఓట్లు..!
Delhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి (rahul gandhi) గుజరాత్ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. మోదీ పేరు ఉన్నవారంతా దొంగలే అని వ్యాఖ్యానించిన కేసులో రాహుల్ హైకోర్టులో అప్పీల్ చేసుకోగా శిక్షను రద్దు చేసేందుకు కోర్టు ఒప్పుకోలేదు. 2019లో ఎన్నికల సమయంలో కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో ప్రచారంలో భాగంగా రాహుల్ ప్రసంగిస్తూ.. మోదీ అనే ఇంటిపేరు ఉన్నవారంతా దొంగలేనా అని వ్యాఖ్యానించారు. దాంతో గుజరాత్‌కు చెందిన ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ సూరత్ న్యాయస్థానంలో రాహుల్‌పై పరువు నష్టం దావా వేసారు. అయితే తాను అలా అనలేదని రాహుల్ న్యాయస్థానానికి తెలిపారు. వాదోపవాదాలు విన్న తర్వాత కోర్టు రాహుల్‌పై ఐపీసీ సెక్షన్ 499, 500 కింద కేసులు నమోదు చేసి దోషిగా తేల్చింది. రాహుల్ అభ్యర్ధన మేరకు వెంటనే బెయిలు కూడా మంజూరు చేసింది. ఈ తీర్పును పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు రాహుల్‌కు గడువు ఇస్తూ అరెస్ట్‌ను 30 రోజుల పాటు నిలుపుదల చేసింది. అప్పీల్‌కు గడువు ఉండగానే రాహుల్‌ను లోకసభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు నోటీసు వచ్చింది. రాహుల్ నియోజకవర్గం అయిన కేరళలోని వాయనాడ్ ఖాళీగా ఉందని ప్రకటించింది.
అయితే.. 2024 ఎన్నికల నేపథ్యంలో రాహుల్‌పై ఈ సస్పెన్షన్ వేటు, జైలు శిక్ష అతని రాజకీయ ప్రయాణానికి వరంగా మారనున్నాయా? అవుననే అంటున్నారు పలు రాజకీయ నిపుణులు. రాహుల్ గాంధీ నానమ్మ, దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి కూడా అప్పట్లో ఆమెకు పడిన జైలు శిక్ష వరంగా మారింది. అప్పట్లో కోర్టు ఇచ్చిన తీర్పుకి ఆమెను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేసినప్పుడు రాజ్యాంగాన్నే తన గుప్పిట్లో పెట్టుకోవాలని ఎమర్జెన్సీని విధించారు ఇందిరా గాంధీ. దాంతో ప్రజలు గట్టిగా తీర్పు ఇవ్వడంలో ఆమె ఓటమిపాలైంది. కానీ ఎమర్జెన్సీ సమయంలో చేసిన అకృత్యాలకు గానూ ఇందిరా గాంధీకి శిక్ష పడినప్పుడు ఆమె జైలుకు వెళ్లాల్సి వచ్చింది. నెహ్రూ కుటుంబానికి చెందిన మహిళ జైలుకి వెళ్లడం అనే విషయం ఇందిరకు వరంగా మారింది. దీనినే ఆమె సానుభూతిగా వాడుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆమె ఇదే సానుభూతిని చూపించి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు.
ఇప్పుడు మనవడు రాహుల్‌కి కూడా ఇదే తరహాలో తనకు పడిన రెండేళ్ల జైలు శిక్ష మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ చేసిన పాదయాత్రకు రాని మైలేజీ.. ఈ రెండేళ్ల జైలు శిక్ష అనే తీర్పుతో వస్తోంది. ఎందుకంటే.. BJP అధికారంలో ఉంది కాబట్టే ఇంత సులువగా వేగంగా రాహుల్ విషయంలో గుజరాత్‌కు చెందిన సూరత్ కోర్టు తీర్పు ఇచ్చిందని కాంగ్రెస్ వర్గాలతో పాటు ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే రాహుల్‌ని సస్పెండ్ చేయడంపై BRS, AAP పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఇది ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడమేనని ఆరోపించాయి.