Telangana: తెలంగాణకు కొత్త గవర్నర్..!
Telangana: తెలంగాణ ప్రస్తుత గవర్నర్ తమిళిసై (tamilisai) త్వరలో పుదుచ్చేరిలో బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దాంతో తెలంగాణకు కొత్త గవర్నర్ రానున్నారు. తూత్తుకూడి నుంచి తమిళిసై పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డాలను కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఒకవేళ తమిళిసై పోటీకి కేంద్రం ఒప్పుకోకపోతే పుదుచ్చేరి గవర్నర్గా బాధ్యతలు తీసుకుంటారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు విశ్రాంత ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారిని నియమించే వ్యూహంలో కేంద్ర ప్రభుత్వం ఉంది.
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలోనే నూతన గవర్నర్ను నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసైకి మంచి అనుబంధం ఉంది. గత BRS ప్రభుత్వంతో తమిళిసైకి శతృత్వం ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. రాజ్ భవన్, ప్రజా భవన్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. అందుకే మొన్న అసెంబ్లీలో స్పీకర్ ప్రమాణ స్వీకారం తర్వాత తమిళిసై ప్రసంగిస్తూ BRS ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తమిళిసైకి మంచి స్నేహం ఏర్పడుతుండడంతో కేంద్ర ప్రభుత్వం తమిళిసైని తెలంగాణ గవర్నర్గా కొనసాగించడం సబబు కాదని భావించింది.