Telangana: వీహెచ్‌కు కాంగ్రెస్ వార్నింగ్

Telangana: కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీహెచ్ హ‌నుమంత రావుకు.. (VH Hanumantha Rao) కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మ‌హేష్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకిస్తూ మీడియా ముందు ఎవ‌రు మాట్లాడినా క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని అన్నారు. అది ఎంత పెద్ద సీనియ‌ర్ నేత‌లైనా వ‌దిలే ప్ర‌సక్తి లేద‌ని చెప్పారు. ఇటీవ‌ల హ‌నుమంత‌రావు గాంధీ భ‌వ‌న్‌లో ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) అభ్యంత‌క‌ర వ్యాఖ్య‌లు చేసారు. పార్టీ నిర్ణ‌యాల ప‌ట్ల అభ్యంత‌రం ఉంటే లోలోప‌లే చ‌ర్చించుకోవాలి కానీ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని మ‌హేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

ఇంత‌కీ వీహెచ్ ఏమ‌న్నారు?

రేవంత్ రెడ్డి ఒక‌ ముఖ్యమంత్రని.. ఆయ‌న్ను కలవాలంటే అంద‌రూ ఆయ‌న‌ దగ్గరకు రావాలి కానీ ఆయ‌నే వాళ్ళ వ‌ద్ద‌కు వెళ్లి ఆహ్వానించడం కరెక్ట్ కాదని అన్నారు. రేవంత్ రెడ్డిని క‌లిసి ఇదే విష‌యం చెబుదామంటే ఆయ‌న టైం ఇవ్వడంలేద‌ని తెలిపారు. తక్కువ సమయంలో ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి ఓక్కడే అని పార్టీని బలోపేతం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాడని అభిప్రాయ‌ప‌డ్డారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూసి కార్యకర్తలు బాధపడుతున్నార‌ని పేర్కొన్నారు.

భారత రాష్ట్ర సమితి (BRS) నేత‌లు ఆ పార్టీలో ఉన్న‌ప్పుడు బాగా సంపాదించుకుని ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వ‌స్తున్నార‌ని అనిపిస్తోంది.. వారిని కేసీఆరే పంపుతున్నారేమో అన్న సందేహం ఉంద‌ని వీహెచ్ అంటున్నారు. ఒక సైడ్ మాత్ర‌మే కాకుండా రెండు వైపులా వాద‌న‌లు విని అప్పుడు సీట్లు ఇస్తే బాగుంటుంద‌ని.. గ‌తంలో జ‌రిగిన అంశ‌మే మ‌ళ్లీ రిపీట్ కావొద్ద‌ని మాత్రమే సూచిస్తున్నాన‌ని అన్నారు.