Singireddy Niranjan Reddy: ఆంధ్రా నేతలు చాకచక్యంగా ప్రచారం చేస్తున్నారు

Singireddy Niranjan Reddy: BRS మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికార YSRCP పార్టీ నేత‌ల‌పై మండిప‌డ్డారు. శ్రీశైలం మీద భారం మోపొద్దని వారు చాకచక్యంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణా, తుంగభద్ర నదులే పాలమూరుకు జీవనాధారమ‌ని తెలంగాణ వచ్చిన తర్వాతనే జూరాలను నిండుగా నింపుకున్నామ‌ని అన్నారు. జూరాల సామర్ధ్యం ఆరున్నర టీఎంసీలు మాత్రమే అని జూరాలకు గరిష్టంగా వరద వచ్చేది 40 రోజులు మాత్రమేన‌ని తెలిపారు. జూరాలకు ఇప్పటికే 5 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉంద‌ని అన్నారు. తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి KCR సూచనలతో తెలంగాణ ప్రాజెక్టులలో నీళ్లను స్టోరేజ్ చేసుకుంటూ వచ్చామ‌ని నీటి పారుదల శాఖా మంత్రి నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయని విమ‌ర్శించారు.

పాలమూరు జిల్లా అవసరాలు తీరాలంటే శ్రీశైలం రిజర్వాయర్ వాడుకోవాలని KCR నిర్ణయించారని తెలంగాణ నీటివాటా తేలే విధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీర్చిదిద్దుకున్నామ‌ని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అన్ని పనులు పూర్తయ్యాయని ఏడు నుండి పది శాతం పనులే మిగిలిపోగా 90 శాతం పనులు పూర్తయ్యాయని వెల్ల‌డించారు. ఉదండాపూర్ నుండి గ్ర్రావిటీతో వచ్చే పనులు ఆపేసి వాటిని వదిలేసి కొత్త ప్రభుత్వం కొత్త పనులు చేపట్టిందని మండిప‌డ్డారు.

2900 కోట్ల కొత్త ప్రాజెక్టులో వచ్చే నీళ్లు లక్ష ఎకరాలు మాత్రమే. ఉద్దండాపూర్ నుండి కాలువలు తవ్వితే గ్రావిటీ నీళ్లతో లక్ష 50 వేల ఎకరాలకు నీళ్లు వస్తాయి. అనవసరమైన భేషజాలతో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ కాలయాపన మూలంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చే విషయంలో మోసం జరుగుతున్నది. కాళేశ్వరం మీద విష ప్రచారాలు చేస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి మీదకు అందరినీ ఆహ్వానించండి. పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేస్తే కొడంగల్ నారాయణ పేటకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది .. జూరాల సామర్ధ్యం 6 టీఎంసీలు. (Singireddy Niranjan Reddy)

జూరాల మీద భారం మోపుతున్నారు. 800 అడుగుల నుండి శ్రీశైలం ద్వారా నీళ్లు తెచ్చుకునేందుకు పాలమూరు రంగారెడ్డి డిజైన్ చేశాం. ఉదండాపూర్ నుండి కరివేన నుండి వెంటనే కాలువలు తవ్వాలి .. అతి తక్కువ ఖర్చులో సాగు నీళ్లు వస్తాయి. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో చిక్క మంచిలి వద్ద మరో రిజర్వాయర్ నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం సిద్ధ‌మైంది. దానిని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవాలి .. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి దీని మీద చర్యలు తీసుకోవాలి. నల్లమల బిడ్డ అని చెప్పుకునే రేవంత్ అచ్చంపేట, కల్వకుర్తి ప్రాంతాలకు నీళ్లు రాని పరిస్థితి ఏర్పడకుండా చూసుకొని ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. ఎగువన కర్ణాటకలో బరాజ్ లు ఆపకుంటే ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. నూటికి నూరుపాళ్లు కొడంగల్ – నారాయణపేటకు నీళ్లు రావాలి.

కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కావాలనే ఉమ్మడి రాష్ట్రంలో దొంగ జీఓ ఇచ్చారు. దానినే రేవంత్ అమలుపరచడం అవగాహనారాహిత్యం. కరివెన వరకు నీళ్లు రావడానికి ప్రస్తుతానికి అవకాశం ఉంది. వాటిని వాడుకుంటే 50 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంచుకునే అవకాశం ఉన్నది. దానితో భూగర్భజలం అద్భుతంగా పెరుగుతుంది. వీటిని వదిలేసి జూరాల మీద భారం మోపడం తప్పు. అనవసరమైన పట్టుదలతో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు. దీనిపై అఖిలపక్షాన్ని పిలవాలి గత ప్రభుత్వ పనుల మీద బురదజల్లే ప్రయత్నం చేయోద్దు. యాదాద్రి పవర్ ప్లాంట్ మీద బురదజల్లుతున్నారు. పాలమూరు రంగారెడ్డి మీద ప్రభుత్వం సమీక్ష చేసి మిగిలిన పనులు పూర్తి చేయాలి. మాకంటే వేగంగా పూర్తి చేయాలి ఈ ప్రాజెక్ట్ మీద వంద కేసులు వేసిన పుణ్యాత్ములు కాంగ్రెస్ నేతలు. వాటిని ఎదుర్కొని పనులు పూర్తి చేశాం
కర్ణాటకను నిలువరించకుంటే ఆ పాపం కాంగ్రెస్ పార్టీదే అని మండిప‌డ్డారు నిరంజ‌న్ రెడ్డి.