Telangana Congress: BJP-BRS ఉమ్మడి డ్రామా
Telangana Congress: తెలంగాణలో కొందరు తమ సొంత రాజకీయ ఆరాటాన్ని పోరాటం అనుకుంటున్నారని యాత్రల పేరుతో హడావుడి చేయాలనుకుంటున్నారని BJP చేపడుతున్న విజయ సంకల్ప యాత్రను వెక్కిరించింది తెలంగాణ కాంగ్రెస్. ఈ నేపథ్యంలో AICC సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీ చంద్ రెడ్డి సెటైర్లు వేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
వాస్తవాలను పాలమూరు ప్రజల ముందుకు తెస్తున్నాను. ఎన్నికలు అనేవి అభివృద్ధి అజెండాను నిర్ణయించుకోడానికి ప్రజల ముందు ఉన్న అపూర్వ అవకాశం. అభివృద్ధి, సంక్షేమం అజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వం… పదేండ్లలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో ప్రజాపాలనతో కొత్త శకాన్ని స్థాపిస్తున్నది. ఇలాంటి సమయంలో పార్లమెంటు ఎన్నికల్లో పాలమూరుతోపాటు తెలంగాణ ప్రజలు అందరూ కాంగ్రెస్ వెంట నిలవాలన్న నిర్ణయానికి ఆల్రెడీ వచ్చారన్నది వాస్తవం.
ఎవరి కోసం యాత్ర ?
బీజేపీ వాళ్లు విజయసంకల్ప యాత్ర చేస్తున్నారట ! ఆ పేరు చూస్తేనే ఆశ్చర్యం కల్గుతున్నది. సంకల్పం అనేది చాలా పవిత్రమైన మాట. ఆ సంకల్పం ఏదో ప్రజల అభివృద్ధి కోసం, భవిష్యత్తు కోసం పని చేస్తామని తీసుకోండి. ప్రచార ఆర్భాటాలు, డాంబికాల కోసం కాదు. పదేండ్లు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కేంద్రంలో మంత్రిగా ఉన్నరు. ఇంకొంత మందికి జాతీయ ఉపాధ్యక్షులు అంటూ ఇత్తడి కిరీటాలు కూడా పెట్టిన్రు. ఏం చేసింది బీజేపీ ? తెలంగాణ కోసం, ఇక్కడి ప్రజల కోసం ఈ పదేండ్లలో ఇదిగో ఈ ప్రాజెక్టు తెచ్చామనో… కట్టామనో… లేదంటే ఫలానా పని చేశామనో చెప్పే దమ్ము, ధైర్యం బీజేపీ ఉన్నాయా ? (Telangana Congress)
తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయాలన్నీ ప్రజల ముందు ఉంచి, లెంపలేసుకునే యాత్ర చేయాలి బీజేపీ. తెలంగాణకు ఒక్కటంటే ఒక్క మేలు కూడా చేయకుండా… పదేండ్లు అధికారం వెలగబెట్టి, ప్రచారం చేసుకుంటా.. విజయ సంకల్ప యాత్ర చేస్తున్నామని చెబుతున్నరంటే ఏమనుకోవాలి ? ఢిల్లీలో ఉన్న వీళ్ల నాయకుడేమో టార్గెట్ 370 సీట్లు అంటున్నరు. ఇది చూస్తుంటే సరిగ్గా 20 ఏళ్ల నాటి పరిస్థితి గుర్తొస్తున్నది. అప్పుడు కూడా ఇండియా షైనింగ్ అని ఇదే బీజేపీ ఇట్లనే ఫేక్ ప్రచారం చేసింది. జనం తిప్పికొట్టారు. ఓడించి ఇంటికి పంపించారు. ఇప్పుడు కూడా బీజేపీకి అలాంటి పరిస్థితి ఖాయంగా రాబోతున్నది.
BJP-BRS ఉమ్మడి డ్రామా :
ఇక బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు నాటకాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పొత్తు ఇప్పుడు కొత్తగా పెట్టుకోవడం ఏంటి ? ఎప్పట్నుంటో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పొత్తు ఉన్నది. కేసీఆర్ చెప్పాడని రాష్ట్ర అధ్యక్షుడిని మార్చేసింది బీజేపీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ని ఓడించడానికి కుట్రలు చేసి ఇదే బీఆర్ఎస్ కి తోక పార్టీగా పని చేసింది బీజేపీ. ఆ విషయం తెలంగాణ ప్రజలకు తెలుసు.
ఇప్పుడు కొత్తగా BJP – BRS తో పొత్తు పెట్టుకున్న, పెట్టుకోకపోయినా… ఈ రెండు పార్టీలు తోడు దొంగలని తెలంగాణ ప్రజలకు తెలుసు. పదేండ్లుగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకు, తెలంగాణ ప్రజల బతుకులు మార్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సరికొత్త అజెండా సిద్ధంచేసింది. తెలంగాణ అభివృద్ధి అజెండా పక్కాగా అమలు కావాలంటే, సంక్షేమం, ఆరు హామీలు అందరికీ చేరాలంటే పార్లమెంటు ఎన్నికల్లో పదిహేడుకు పదిహేడు సీట్లూ కాంగ్రెస్ ను గెలిపించాలి. ప్రజలకు ఆ విషయం తెలుసు. అందుకే తెలంగాణలో పక్కాగా, వందకు వందశాతం కాంగ్రెస్‌ని గెలిపించబోతున్నరు. ఈ సంకల్ప యాత్రలన్నీ ఖాయంగా సంతకు పోతాయ్ అంటూ వెక్కిరించారు.