Mahanadu: నేడు TDP జాతీయ అధ్యక్షుడి ఎన్నిక.. రేపు బహిరంగ సభ!

AP: ఏపీలోని రాజమహేంద్రవరంలో (rajamahendravaram) TDP ఆధ్వర్యంలో మహానాడు (mahanaadu) కార్యక్రమానికి సంబంధించి శుక్రవారం నుంచి సమావేశాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం పొలిట్‌బ్యూరో సభ్యుల సమావేశం జరిగింది. ఇక ఇవాళ ప్రతినిధుల సభ జరగనుంది. రేపు బహిరంగ సభలో చంద్రబాబుతో, ముఖ్యనేతల ప్రసంగాలు ఉండనున్నాయి. ఇక ఇవాళ.. టీడీపీ జాతీయ అధ్యక్షుడిని ప్రతినిధులు ఎన్నుకోనున్నారు. సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ కరోనా కారణంగా ఈ దఫా ఆలస్యం అయ్యింది.

ఇవాళ ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా.. ఒంటి గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను పరిశీలిస్తారు. అనంతరం గంటపాటు అంటే సాయంత్రం నాలుగు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుంది. అవసరమైతే సాయంత్రం 4 నుంచి ఆరు గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. రాత్రి ఏడు గంటలకు ఎన్నికైన జాతీయ అధ్యక్షుడి పేరును ఎన్నికల కమిటీ ప్రకటిస్తుంది. అయితే, చంద్రబాబు ఎన్నిక లాంఛనమేనని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇక రేపు జరిగే కార్యక్రమం కీలకం కానుంది. ఏడాది వ్యవధిలోనే ఎన్నికలు వస్తుండటంతో టీడీపీ నాయకులు కేడర్‌కు ఏవిధంగా దిశానిర్ధేశ చేస్తారు అన్నది తేలాల్సి ఉంది.