Singireddy Niranjan Reddy: ఛ‌లో మేడిగ‌డ్డ‌.. కాంగ్రెస్‌కు చెమ‌ట‌లు..!

Singireddy Niranjan Reddy: BRS ఛలో మేడిగడ్డ పిలుపుతో వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని, సర్కారు చేస్తున్న దుష్ప్రచారం తెలిస్తే రేపటి నుండి ఏం చెప్పుకోవాలో తెలియక కాంగ్రెస్ పార్టీకి చెమటలు ప‌డుతున్నాయ‌ని అన్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అందుకే పాల‌మూరు ప్రాజెక్ట్‌ను సంద‌ర్శించేందుకు కాంగ్రెస్ నిర్ణ‌యించింద‌ని తెలిపారు.

“””” వందల కేసులు వేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం ఆలస్యానికి కారణం అయింది వాస్తవం కాదా ? నాలుగున్నర దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు కట్టకుండా, మొదలుపెట్టి దశాబ్దాలు పూర్తి కాకుండా పాలమూరు పొలాలను ఎండబెట్టి ప్రజలను వలసల పాలు చేసింది నిజం కాదా ? పూర్తయినా ప్రాజెక్టుల నుండి సాగునీళ్లు పూర్తి స్థాయిలో ఇవ్వకుండా, నీళ్లు కేటాయించకుండా కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా నష్టపోయేందుకు కారణం అయింది కాంగ్రెస్ కాదా ? కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులు తాకట్టుపెట్టి దక్షిణ తెలంగాణను తీరనిద్రోహం చేసింది కాంగ్రెస్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా గురించి కాంగ్రెస్ ఎన్నడయినా అడిగినా పాపాన పోయిందా ? కృష్ణాజలాలలో తెలంగాణ వాటా కోసం ఏ ఒక్క రోజయినా పట్టుబట్టిన దాఖలాలు ఉన్నాయా ? అధికారంలోకి వచ్చి మూడు నెలలు కావస్తున్నా పాలమూరు రంగారెడ్డి మీద ఎందుకు సమీక్ష చేయలేదు ? (Singireddy Niranjan Reddy)

90 శాతం పూర్తయిన ప్రాజెక్టు పనులు కొనసాగించి పూర్తిచేయకుండా దాదాపు రూ.7 వేల కోట్ల టెండర్లు ఉన్న ఫలంగా ఎందుకు రద్దు చేశారు ? 90 శాతం పనులు పూర్తయి ఒక మోటారు ట్రయల్ రన్ పూర్తయినా ఇప్పటి వరకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై ప్రభుత్వ విధానం ఎందుకు స్పష్టం చేయలేదు ? ఆదరాబాదరాగా నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టడం ఎవరి ప్రయోజనాల కోసం ? ఉద్దండాపూర్ నుండి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకుపోయే అవకాశం ఉన్నా నీళ్లు అందుబాటులో లేని జూరాల నుండి కొడంగల్ – నారాయణపేట ఎత్తిపోతల చేపట్టడంలో ఉన్న మర్మమేంటి ? కృష్ణా జలాలను ఢిల్లీకి రాసిచ్చిన కాంగ్రెస్ నిర్వాకంతో చుక్క నీరు అందక కృష్ణా పరివాహక ప్రాంతం ఎడారిలా మారే ప్రమాదం పొంచి ఉంది. పదేళ్లు అధికారంలో ఉన్నా ప్రాజెక్టులపై పెత్తనం కేంద్రానికి ఇచ్చేందుకు కేసీఆర్ తలొగ్గలేదు. అసలు సాగునీటి ప్రాజెక్టులపై , తెలంగాణకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ పార్టీకి అవగాహన లేదు. కాంగ్రెస్ నాయకులకు పరిపక్వత లేదు. ఏ మొహం పెట్టుకుని పాలమూరు ఎత్తిపోతల పథకం సందర్శనకు వస్తున్నారు.

కేవలం BRS చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు విఫలయత్నం అని చెప్పేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది. బచావత్ ట్రిబ్యునల్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ నీటి వాటా అడగకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలే. మొన్న బీఅర్ఎస్ నల్లగొండ సభ అంటే మేడిగడ్డ సందర్శన అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ మేడిగడ్డ సందర్శన అంటే కాంగ్రెస్ పాలమూరు సందర్శన అంటున్నారు. ప్రతిపక్షం నుండి అధికారంలోకి వచ్చి వందరోజులకు దగ్గర పడుతుంది అన్న సోయి కాంగ్రెస్ నేతలకు ఉన్నదా ? పబ్లిసిటీ స్టంట్లతో ప్రజలను మభ్యపెడుతున్నాం అన్న భ్రమల్లో ఉన్నారు. కాంగ్రెస్ చేతిలో పాలన కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లుంది. వందరోజులు దాటిన తర్వాత ప్రజలే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు.

పాలమూరు పొలిమేరల్లో ముక్కు నేలకు రాసి కాంగ్రెస్ నేతలు జిల్లాలో అడుగుపెట్టాలి. పాలమూరులో ఏటా 15 లక్షల మంది వలసలకు, రైతులు, వలస కూలీల చావులకు కారణం కాంగ్రెస్. ద‌త్త‌త‌ తీసుకుని పాలమూరును దగా చేసిన చంద్రబాబు శిష్యుడే కాంగ్రెస్ ముఖ్యమంత్రి . వలసల జిల్లాలో వ్యవసాయ విప్లవం తీసుకొచ్చి రైతుకు దన్నుగా నిలబడిన చరిత్ర KCR, BRS పార్టీది. పోటీ యాత్రలు చేయడం కాదు.. దమ్ముంటే.. వ్యవసాయ దిగుబడిలో పోటీ పడండి. బీఆర్ఎస్ హయాంలో సాగైన భూమికి.. రెండింతలు భూమిని సాగులోకి తెచ్చి చూపించండి. ప్రతి ఎకరానికి సాగునీరు అందించి.. ఇప్పటికే ఆందోళనలో ఉన్న రైతుల కష్టాలు తీర్చండి. ఉన్న తెలంగాణను వూడగొట్టడం వల్ల.. అత్యంత ఎక్కువగా నష్టపోయింది. పాలమూరు జిల్లానే అని బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది..! (Singireddy Niranjan Reddy)

ఆ పాపం..శాపం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీదే..! పాలమూరు పెద్ద రైతులు కూడా..పట్నం వచ్చి కూలీలుగా..మేస్త్రీలుగా పనిచేసే దుస్థితికి తీసుకొచ్చిన దుర్మార్గం..కాంగ్రెస్ పార్టీదే..! కృష్ణా జలాలను..బేసిన్ అవతలకు తరలించి ఇష్టారాజ్యంగా రాయలసీమలో ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పాలకులు కాదా..? కృష్ణా జలాలను కొల్లగొట్టి తీసుకెళుతుంటే…పదవుల కోసం పెదవులు మూసుకున్నది చేవలేని..చేతగాని తెలంగాణ కాంగ్రెస్ నేతలే కదా..! పోతిరెడ్డిపాడు పొక్కను పెద్దగా చేసి శ్రీశైలం నీళ్లను దోచుకెళుతుంటే నోరెత్తని దద్దమ్మలు తెలంగాణ కాంగ్రెస్ లీడ‌ర్లే“””” అని విమ‌ర్శ‌లు గుప్పించారు.