పాలకుడిగా సిద్దా.. సేనానిగా డీకే: అప్పుడే BJPలో వణుకు!
Bengaluru: కర్నాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అతిరధమహారథుల మధ్య కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దారామయ్య(siddaramaiah) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. బెంగళూరులోని కంఠీవర క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్, ప్రియాంక గాంధీలతోపాటు.. మల్లిఖార్జున ఖర్గే ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇక డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్(dk shivakumar) ప్రమాణం చేశారు. మరో 10 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి కేబినెట్లోకి తీసుకున్నారు. వీరిలో కూడా అనేకమంది గతంలో మంత్రి పదవులు చేసిన వారు ఉన్నారు. ఇక దేశంలోని విపక్షాల నేతలందరూ ఒక వేదిక పైకి కలిసి రావడం 2014 తర్వాత ఇదే తొలిసారి. ఈ కార్యక్రమానికి ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. విపక్షాల మద్దతుతో వచ్చే ఎన్నికల్లో కర్ణాటక రోల్ మోడల్‌గా గెలవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఈ వేదిక ద్వారా ప్రతిపక్షాల ఐక్యతను చాటి చెప్పేలా కాంగ్రెస్ విజయం సాధించిందని చెప్పవచ్చు.
ఈ సందర్బంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అయిదు హామీలను ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తాయన్నారు. మరో రెండు గంటల్లో కర్ణాటక తొలి కేబినెట్ సమావేశం జరగనున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. ప్రజలకు అవినీతి రహిత సేవలను అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. కర్నాటక సీఎం ప్రమాణ స్వీకారానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాత్, చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్, బిహార్ సీఎం నితీష్ కుమార్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, తేజస్వీ యాదవ్, మెహబూబా ముఫ్తీ, ఏచూరి సీతారం, డి.రాజా, ఎన్నెస్పీ అధ్యక్షుడు శరద్ పవార్, తమిళ నటుడు కమల్ హాసన్, శివరాజ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.