Sheikh Hasina: పెన్నం మీద నుంచి పొయ్యిలో పడతానంటున్న హసీనా
Sheikh Hasina: గొర్ర కసాయి వాడినే నమ్ముతుంది అన్నట్లు ఉంది ఇప్పుడు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పరిస్థితి. బంగ్లాదేశ్‌లో అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసి తన ప్రాణాలు కాపాడుకునేందుకు ఢిల్లీకి చేరుకున్నారు హసీనా. ఢిల్లీ నుంచి ఆమె యూకేకు వెళ్లాల్సి ఉంది. ఇక బంగ్లాదేశ్‌కు వెళ్లకుండా శాశ్వతంగా యూకేలోనే ఉండిపోవాలని ఆమె నిర్ణయించుకున్నారు. అనుమతి రావాలే కానీ ఇప్పటికిప్పుడు హసీనా యూకేకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఈ నిర్ణయంతో హసీనా పరిస్థితి పెన్నం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. ఎందుకంటే .. బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం హసీనా ప్రభుత్వాన్ని కూల్చేయాలని ప్లాన్ చేసింది యూకే రాజధాని లండనే. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కొడుకు తారీఖ్ రెహ్మాన్ పాకిస్థాన్ ఐఎస్ఐ, చైనా, లండన్‌తో కలిసి బంగ్లాదేశ్‌లో ఈ అల్లర్లు సృష్టించారని ఇంటెలిజెన్స్ వర్గాలు అంటున్నాయి. తనపై కుట్ర చేసిన లండన్‌కే అంటే యూకేకి హసీనా వెళ్లాలనుకుంటున్నారు. మరి అక్కడ ఆమె ప్రాణాలకు ముప్పు పొంచి లేదా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తనపై కుట్ర వెనుక లండన్ హస్తం ఉందన్న అంశంపై హసీనా ఇంకా స్పందించాల్సి ఉంది.