Shashi Tharoor: రోజుకో లైంగిక వేధింపు.. భారతీయ మగవారిలో ఏదో సమస్య ఉంది
Shashi Tharoor: కేరళ చిత్ర పరిశ్రమలో హేమ కమిటీ రిపోర్ట్ బయటికి వచ్చిన నేపథ్యంలో నటీమణులు బయటికి వచ్చి తమకు మాలీవుడ్‌లో ఎదురైన లైంగిక వేధింపుల గురించి బయటపెడుతున్నారు. రోజుకో నటి బయటికి వచ్చి ఫలానా నిర్మాత, దర్శకుడు, హీరో తనను లైంగికంగా వేధించారని బయటపెడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
“” నేను ఉదయాన్నే వార్తా పత్రిక పట్టుకుంటే చాలు ఎక్కడో ఒక చోట ఎవరో ఒక యువతో, కాలేజీ అమ్మాయో, చిన్న పిల్లో, పెద్దావిడో లైంగిక వేధింపులకు గురయ్యారు అనే వార్త కనిపిస్తూనే ఉంటుంది. ఇది ఇప్పుడిప్పుడు జరుగుతున్నవి కావు. నిర్భయ ఘటన, మొన్న జరిగిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఘటన తర్వాత ఇలాంటి ఘటనలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. రోజూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అంటే మన భారతీయ పురుషుల్లోనే ఏదో సమస్య ఉంది. ఈ వేధింపులు, అత్యాచార ఘటనలను పూర్తిగా అరికట్టలేకపోయినా కనీసం ఏదో ఒక సొల్యూషన్ అయితే తీసుకురావాలి.
ఇలాంటి ఘటనలు రోజూ జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేం. మనం ఏమన్నా చేయగలిగింది ఉంటే.. అది మగపిల్లలకు స్కూల్ రోజుల నుంచే ఆడవారి పట్ల ఎలా ప్రవర్తించాలి అనే అంశాలను నేర్పించాలి. అప్పుడే రాబోయే తరాల్లో మార్పు వస్తుందని నేను భావిస్తున్నాను. కేరళ చిత్ర పరిశ్రమపై వచ్చిన హేమ కమిటీ రిపోర్టు ఐదేళ్ల క్రితమే వచ్చినప్పటికీ ప్రస్తుతం కేరళలో అధికారంలో ఉన్న CPIM పార్టీ దానిని వెంటనే రిలీజ్ చేయకుండా దాచింది. ఇది క్షమించరాని నేరం “” అని మండిపడ్డారు థరూర్