పుతిన్ విషం పెట్టి చంపాలనుకున్నాడు.. రష్యన్ గూఢచారి ఆరోపణ
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనను విషం పెట్టి చంపాలనుకున్నాడని సంచలన ఆరోపణలు చేసాడు రష్యాన్ గూఢచారి సర్జెయ్ స్క్రీపాల్. 2018లో నోవిచోక్ విషం పెట్టి చంపాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. తాను యూకేలో ఉన్నప్పుడు తనపై తన కూతురిపై ఈ నోవిచోక్ పాయిజనింగ్‌ని ప్రయోగించారని అన్నారు. అయితే ఇది నిరూపించడానికి తన దగ్గర సరైన ఆధారాలు లేవని అన్నాడు. 2018 మార్చిలో సర్జెయ్ తన కూతురు ఉలియా యూకేలోని తమ నివాసంలో స్పృహకోల్పోయి కనిపించారు. వెంటనే వారిని హాస్పిటల్‌కు తరలించగా వారి ఇంటి తలుపుపై నోవిచోక్ అనే అత్యంత విషపూరితమైన పాయిజన్‌ను రుద్దారని అది ముట్టుకుని పీల్చడం వల్ల ఇద్దరూ స్పృహ కోల్పోయారని అన్నారు.
ఈ ఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత ఓ సాధారణ వ్యక్తి సర్జెయ్ ఇంటి ముందు నుంచి వెళ్తూ ఈ నోవిచోక్ మిక్స్ చేసి ఉన్న పెర్ఫ్యూమ్ను పీల్చి అక్కడికక్కడే చనిపోయాడు. దీనిపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవన్నీ తప్పుడు ఆరోపణలని ఇంకోసారి ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోం అని హెచ్చరించింది. ఈ విషం ఘటనను తీవ్రంగా పరిగణించిన యూకే ప్రభుత్వం పలువురు రష్యన్ దౌత్యాధికారులను డిస్మిస్ చేసింది. ముగ్గరు రష్యన్ అధికారులపై మర్డర్ కేసులు ఫైల్ చేసింది. ఇప్పుడు దీనిపై సర్జెయ్ వ్యాఖ్యానిస్తూ ఇది పుతిన్ పనే అని ఆరోపిస్తున్నాడు. పుతిన్ మాత్రం అసలు తనకు ఈ విషయంతో ఎలాంటి సంబంధం లేదని అంటున్నాడు.
నోవిచోక్ పాయిజనింగ్ అంటే ఏంటి?
కోల్డ్ వార్ సమయంలో సోవియట్ యూనియన్‌కి చెందిన ఏజెంట్లు ఈ నోవిచోక్ పాయిజన్‌ను తయారుచేసారు. నోవిచోక్ అనేది రష్యన్ పదం. దీని అర్థం న్యూ కమర్ (కొత్త వ్యక్తి అని). ఇది ఒక్కసారి పీల్చినా శరీరంలోని నాడీ వ్యవస్థ చచ్చుబడిపోతుంది. అది కూడా కొన్ని క్షణాల్లోనే. అలా మెల్లిగా కండరాలు, అవయవాలు విఫలమవుతాయి. వెంటనే పక్షవాతం, గుండెపోటు వచ్చి అది మరణానికి దారితీస్తుంది. వివిధ మిలిటరీ వ్యవహారాలు, యుద్ధాల్లో దీనిని లిక్విడ్, గ్యాస్, పౌడర్ రూపంలో వాడతారు.
రష్యన్ గూఢచారి అయిన సర్జెయ్పై ఈ నోవిచోక్ని ఉపయోగించారని తెలిసిన తర్వాతే ఈ పేరు తెగ వైరల్ అయ్యింది. 2020లో రష్యన్ ప్రత్యర్ధి నేత అయిన అలెక్సెయ్ నవాల్నీని కూడా ఇదే నోవిచోక్ని వాడి చంపేసారు. అసలు దీనిని వేరే ప్రాంతాలకు స్మగ్లింగ్ చేసినా కనిపెట్టలేరు. అంతర్జాతీయంగా ఈ నోవిచోక్పై నిషేధం విధించారు.
సర్జెయ్‌ని రష్యా ఎందుకు టార్గెట్ చేసింది?
రష్యా సర్జెయ్‌ని టార్గెట్ చేయడానికి కారణం అతను డబుల్ రోల్ ఆడాడు. ఓ పక్క రష్యాకు చెందిన గూఢచారిగా పనిచేస్తూనే మరో పక్క బ్రిటన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన MI6 తరఫున పనిచేసాడు. 1990 నుంచి 2000 సమయంలో రష్యాకు చెందిన కీలక సమాచారాన్ని బ్రిటన్‌కు చేరవేసాడు. యూరప్‌లో రష్యా రహస్యంగా చేపడుతున్న అంశాలను కూడా బ్రిటన్‌కు చేరవేసాడు.
రష్యాలో గూఢచారిగా పనిచేయాలంటే దమ్ముండాలి. రష్యా తరఫున పనిచేస్తున్నామంటే చావడానికైనా సిద్ధంగా ఉండాలి కానీ చావుకి భయపడి రహస్యాలన్నీ బయటపెడితే రష్యానే వారిని ఏసేస్తుంది. 2006లో సర్జెయ్‌ని రష్యా అదుపులోకి తీసుకుని 13 ఏళ్లు జైలు శిక్ష విధించింది. 2010లో ఖైదీల మార్పిడి కార్యక్రమంలో భాగంగా సర్జెయ్ విడుదలయ్యాడు. ఇది రష్యాకు అస్సలు నచ్చలేదు. నిజానికి సర్జెయ్‌ని జైల్లోనే వేసేయాల్సింది కానీ లక్కీగా తప్పించుకున్నాడు. ఇప్పుడు సర్జెయ్కి యూకే ప్రభుత్వం రక్షణ కల్పిస్తోంది. దాంతో అతన్ని యూకేలోనే వేసేయాలని రష్యా ప్లాన్ చేస్తోంది.