Lasya Nandita మృతి కేసులో ట్విస్ట్..!
Lasya Nandita: సికింద్రాబాద్ కంటోన్మెంట్ భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్యే లాస్య నందిత ఈరోజు తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. అల్పాహారం కోసం డ్రైవర్ ఆకాశ్‌తో కలిసి నందిత పటాన్ చెరు వైపు వెళ్తుండగా.. ORR వద్ద కారు అదుపు తప్పి రైలింగ్‌ను ఢీకొంది. ఈ ఘటనలో లాస్య నందిత అక్కడికక్కడే మృతిచెందగా.. డ్రైవర్ ఆకాశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆకాశ్ యశోదలో చికిత్స పొందుతున్నాడు. ఇతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో నందితో పాటు పర్సనల్ అసిస్టెంట్ కూడా ఉన్నాడు. ఇతను స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
ఆకాశ్‌పై అనుమానం
అయితే.. డ్రైవర్ ఆకాశ్‌పై అనుమానంతో లాస్య నందిత సోదరి నివేదిత పటాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఉదయం 5 గంటలకు ఆకాశ్ నుంచి తమకు ఫోన్ కాల్ వచ్చిందని.. ప్రమాదం గురించి ఉన్నది ఉన్నట్లు కాకుండా యాక్సిడెంట్ అయ్యింది తనకు నందితకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని చెప్పి లోకేషన్ షేర్ చేసాడట. (Lasya Nandita)
ALSO READ: Lasya Nandita: లాస్య నందితని వెంటాడిన ప్రమాదాలు
వెంటనే నివేదిత తన తల్లితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి చూడగా.. కారు నుజ్జు నుజ్జుగా కనిపించిందని అందులో నందిత కూర్చున్న సీటు ఘోరంగా దెబ్బతిని ఉండటం చూసి అప్పుడే తమకు అనుమానం వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ర్యాష్ డ్రైవింగ్ వల్లే తన సోదరిని తమకు కాకుండా చేసాడని ఆకాశ్‌పై మండిపడ్డారు. నివేదిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు డ్రైవర్ ఆకాశ్‌పై 304 ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసారు. అయితే ఆకాశ్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఇతను కోలుకునే వరకు విచారణ జరిగేలా లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నివేదిత మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కడో చిన్న అనుమానం ఉండటంతోనే కోర్టు ద్వారా ప్రొసీడ్ అవ్వాలని అనుకుంటున్నట్లు తెలిపారు.
రెండు యాక్సిడెంట్లు.. ఒక్కడే డ్రైవర్
అయితే.. లాస్య నందితకు ఇదే నెలలో 13న కారు ప్రమాదం జరిగింది. నల్గొండలో భారత రాష్ట్ర సమితి సభను చూసుకుని తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో కారు మరో వాహనాన్ని ఢీకొంది. ఆ సమయంలో లాస్య నందిత తృటిలో తప్పించుకున్నారు. ఆ సమయంలో డ్రైవర్ సంతోష్ నిద్ర మత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఒక ఎమ్మెల్యే కారుకు డ్రైవర్‌గా వ్యవహరించడం అంటే మామూలు విషయం కాదు. లాస్య నందిత ఈ విషయాన్ని అప్పుడైనా గ్రహించి వెంటనే వేరే డ్రైవర్‌ను నియమించుకుని ఉంటే ఇప్పుడు ప్రాణాలతో ఉండేవారేమో.
అయితే.. లాస్య నందితకు డ్రైవర్ ఆకాశ్‌కు మధ్య ఈరోజు ఉదయం ఏదన్నా గొడవ జరిగిందా? అందుకే కోపంతో ర్యాష్‌గా డ్రైవ్ చేసాడా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే లాస్య నందిత ప్రమాదానికి గురైనప్పుడు ఆమె చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత ఆకాశ్ ఆంబులెన్స్‌కు ఫోన్ చేసి హుటాహుటిన బాడీని హాస్పిటల్‌కు తరలించి ఆ తర్వాత కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. తాను హాస్పిటల్‌కు తీసుకెళ్లినప్పుడు బతికే ఉందని.. హాస్పిటల్‌కు వెళ్లాక చనిపోయిందని డ్రామా ఆడుతున్నాడని లాస్య నందిత కుటుంబీకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
టిప్పర్‌ను ఢీకొన్నాడా?
ఉదయం సదాశివపేట నుంచి ఓఆర్ఆర్ ఎక్కే సమయంలో CCTV ఫుటేజ్ తీసే పనిలో పోలీసులు ఉన్నారు. ఎన్ని గంటలకు టోల్ ఎంట్రీ, ఎగ్జిట్ ఎప్పుడు జరిగింది అనే విషయాలను బయటికి లాగుతున్నారు. సాధారణంగా ఓఆర్ఆర్ పై పార్కింగ్ ఉండదు. ఎమర్జెన్సీ సమయంలో ఎడమ వైపునకు ఆపుకోవచ్చు. ఎక్కువ సేపు ఆపుకోవడానికి వీల్లేదు. ముఖ్యంగా ఆకాశ్, లాస్య నందిత వెళ్తున్న సమయంలో భారీ వాహనాలు వెళ్తుంటాయి. నగరంలోకి ఎంట్రీ అయ్యే వాహనాలన్నీ కూడా ఉదయం 8 కంటే ముందుగానే ఓఆర్ఆర్ ద్వారా స్పాట్‌కి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలోనే భారీ వాహనాలు ఓఆర్ఆర్ ద్వారా వెళ్తుంటాయి. ఆ వేగంలో భాగంగానే లాస్య ప్రయాణిస్తున్న కారు టిప్పర్‌ను గుద్ది ఆ తర్వాత రైలింగ్‌ను తగిలినట్లు అనుమానాలు ఉన్నాయి. ఏది ఏమైనా డ్రైవర్ స్పృహలోకి వస్తే తప్ప నిజాలు వెల్లడికావు.