Seeman: బరువు తగ్గడానికే పవన్ దీక్ష.. లడ్డూలో సనాతన ధర్మమేంటి?
Seeman: తిరుమల లడ్డూలో సనాతన ధర్మం ఉందంటే మేం ఒప్పుకోం అని అంటున్నారు తమిళనాడుకి చెందిన నామ్ తమిళర్ కట్చి కోఆర్డినేటర్ సీమన్. ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ లడ్డూపై రాజకీయాలు చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు. తిరుపతి లడ్డూలో సనాతన ధర్మం ఉందంటే తాము ఒప్పుకోమని.. నటుడు కార్తీ చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని తెలిపారు. అయినా ఆయన చేత క్షమాపణలు చెప్పించుకున్నారని.. కార్తీ కూడా తన సినిమాను ఎక్కడ అడ్డుకుంటారో అన్న భయంతో మాత్రమే క్షమాపణలు చెప్పారు కానీ తన వ్యాఖ్యల్లో తప్పుందని కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడుతున్నారన్న అంశం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రతి రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకులు ఈ అంశంపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేసి తిరుమల ప్రతిష్ఠను కాపాడాలని కోరుతున్నారు. అయితే.. సీమన్ గతంలో కూడా ఇదే అంశంపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసారు. దీనిని జాతీయ స్థాయి వివాదంగా మారాల్సిన అవసరం ఏముంది? లడ్డూ తిన్నవారు ఎవ్వరూ చనిపోలేదుగా. మరి సమస్యేంటి అని ఆయన వ్యాఖ్యలు చేసారు. కల్తీ నెయ్యి ఎవరు అమ్మారో తెలుసుకుని వారిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టడమో లేక వారిపై చర్యలు తీసుకోవడమో చేస్తే అయిపోయేదానికి ఇంత రాద్దాంతం అవసరమా అని ప్రశ్నించారు.