Russia: రాజకీయ సంక్షోభం వేళ.. బంగ్లాకు రష్యా హెచ్చరిక
Russia: రాజకీయ సంక్షోభంతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌కు రష్యా హెచ్చరికలు జారీ చేసింది. రాజకీయ గొడవలు పక్కనపెట్టి ముందు మా అప్పు సంగతి తేల్చండి అని నిలదీసింది. రూప్పూర్ క్షిపణి ప్లాంట్ కోసం మార్చి 2022 నుంచి మార్చి 2024 మధ్యలో బంగ్లాదేశ్ రష్యా నుంచి 12.65 బిలియన్ డాలర్లు అప్పు తీసుకుంది. రష్యా ఈ అప్పుకు 4 శాతం వడ్డీ విధించింది. ఆలస్య రుసుము 2.4 శాతం విధించింది. మార్చి 2022 నుంచి 2024 వరకు బంగ్లాదేశ్ రష్యాకు కట్టాల్సిన బాకీలు 480 మిలియన్ డాలర్లు. ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ వరకు ఆ వడ్డీ రేటు 150 మిలియన్ డాలర్లు ఇంకా మిగిలుంది. సెప్టెంబర్ 15 నాటికి బంగ్లాదేశ్ రష్యాకు కట్టాల్సిన వడ్డీ 630 మిలియన్ డాలర్లు.
రాజకీయ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో ఎక్కడ తమ నుంచి తీసుకున్న అప్పు ఎగ్గొడుతుందో అని రష్యా ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబర్ 15 లోగా మొత్తం వడ్డీని డాలర్ల రూపంలో కానీ చైనీస్ యువాన్ కరెన్సీ రూపంలో కానీ కట్టాలని ఆదేశాలు జారీ చేసింది. రష్యా నుంచి అప్పు చేసిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఇండియాలో కూర్చుంది. దాంతో ఈ భారం తాత్కాలిక బాధ్యతలు తీసుకున్న మహ్మద్ యూనస్ మెడకు చుట్టుకుంది. అసలు రష్యా ద్వారా షేక్ హసీనా చేసుకున్న ఒప్పందాలు కూడా యూనస్‌కు తెలీవు. ఆమెతో చర్చలు జరుపుదాం అంటే ఎప్పుడెప్పుడు యూకే నుంచి అనుమతి వస్తుందా ఎప్పుడెప్పుడు భారత్ నుంచి చెక్కేద్దామా అని హసీనా వేచి చూస్తోంది.
దాంతో యూనస్ రష్యాను ఓ రిక్వెస్ట్ చేసారు. బంగ్లాదేశ్ రష్యాను అప్పుగా తీసుకున్న అసలు మొత్తం చెల్లింపులను 2027 మార్చి నుండి 2029 మార్చి వరకు రెండు సంవత్సరాలు వాయిదా వేయాలని అభ్యర్ధించారు. ఇందుకు రష్యా చచ్చినా ఒప్పుకోలేదు. దాంతో బంగ్లాదేశ్ 2027 మార్చిలోనే నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం అసలు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
అదానీకి రుణపడి ఉన్న బంగ్లా
రష్యకే కాదు.. భారతీయ బిలియనేర్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ సంస్థలకు కూడా బంగ్లాదేశ్ రుణ పడి ఉంది. అదానీ సంస్థలకు బంగ్లా 800 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. భారత్‌లోని గోడ్డా పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్ కొనుగోలు కోసం బంగ్లాదేశ్ అదానీ సంస్థ నుంచి అప్పు తీసుకుంది. భారత్‌లోని 63 శాతం విద్యుత్ ఎగుమతులు బంగ్లాదేశ్‌కే ఉన్నాయి. అటు అదానీ సంస్థకు చెల్లించలేక ఇటు రష్యాకు కట్టలేక బంగ్లా పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిగా మారింది.