Raja Ravindra: జగన్ డైనమిక్ లీడర్.. మళ్లీ వస్తారు
Raja Ravindra: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఓ డైనమిక్ లీడర్ అని అన్నారు ప్రముఖ నటుడు రాజా రవీంద్ర. జగన్ జైలు నుంచి బయటికి వచ్చి ధైర్యంగా పాదయాత్ర చేస్తున్న సమయంలో రాజా రవీంద్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే తాను పార్టీ కండువా కప్పుకున్నంత మాత్రాన అది కేవలం జగన్ అంటే అభిమానంతోనే కానీ.. పార్టీ కోసం పని చేసేందుకు కాదని అప్పట్లోనే చెప్పేసారు. అయితే ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన జగన్ ఓడిపోవడానికి కారణమేంటో రాజా రవీంద్ర తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
“” జగన్ ఒక డైనమిక్ లీడర్. ముఖ్యమంత్రి కొడుకు అయివుండి కష్టమే తెలీకుండా పెరిగి ఉంటారు. అలాంటి వ్యక్తి జైలు పాలైనప్పుడు పది రోజులకే పిచ్చెక్కిపోతుంది. అలాంటిది ఆయన 18 నెలలు జైల్లో ఉండి పార్టీని తన ఆధీనంలో ఉంచుకుని జైలు నుంచి బయటికి వచ్చి పాదయాత్ర చేయడమే కాదు.. ముఖ్యమంత్రి అయ్యారు కూడా. అది నిజంగా చాలా గొప్ప విషయం. అలా ఉండాలంటే ఎంతో పట్టుదల కాన్ఫిడెన్స్ ఉండాలి. జగన్‌లో నాకు ఆ క్వాలిటీలు నచ్చే నేను పార్టీ కండువా కప్పుకున్నాను. అయితే జగన్ సీఎం అయ్యాక మాత్రం ఒకసారి ఆయన్ను కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. నాది భీమవరమే అయినా నాకు ఓటు హక్కు తెలంగాణలో ఉంది.
నాకు ఏపీ రాజకీయాల గురించి వ్యక్తిగతంగా తెలీదు. పత్రికల్లో చదివితేనే తెలుస్తోంది. ఓ మధ్య తరగతి కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్య వస్తే ఇక చేసేదేమీ ఉండదు. మొత్తం కుటుంబం రోడ్డు మీదకు వస్తుంది. అలాంటి వారి కోసం జగన్ పథకాలు తేవడం నిజంగా గొప్ప విషయం. కానీ ప్రజల ఆలోచన వేరేలా ఉంది. తెలంగాణలో పదేళ్లు కేసీఆర్ సీఎంగా ఉన్నారు. మూడోసారి ఓడిపోయారు. జనాలకు ఒకరినే ఎన్నేళ్లని చూస్తాం అనే ధోరణిలో ఉంటారు. మనుషుల సైకాలజీ అలాగే ఉంటుంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ గెలవాలంటే ప్రజల ఆలోచనా ధోరణిని బట్టి ఉంటుంది. కానీ ఆయన పార్టీ పెట్టిన రోజే గెలుపైనా ఓటమైనా ఒంటరిగా పోరాడతానని పొత్తులు పెట్టుకోనని చెప్పారు. ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. కేంద్రం నుంచి నిధులు రాకో లేక రాష్ట్రంలోనే నిధుల కోత ఉందని చెప్పో కొందరు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉంటారు. కానీ జగన్ అప్పు చేసో ఏదో ఒకటి చేసో ప్రజలకు పథకాలు అందించారు. అది నిజంగా గొప్ప విషయమే “” అని తెలిపారు.