Rahul Gandhi: కుల గణన సర్వే చేపట్టగలరా కేసీఆర్ గారూ..?
తెలంగాణ ఎన్నికలు (telangana elections) సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (rahul gandhi) తెలంగాణ సీఎం KCRకు కొత్త సవాల్ విసిరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జైశంకర్ భూపాలపల్లిలో రాహుల్ పర్యటిస్తున్నారు. KCRకు దమ్ముంటే రాష్ట్రంలో కుల గణన (caste census) సర్వే చేపట్టగలరా అని ప్రశ్నించారు. తాను ఆల్రెడీ రాజస్థాన్, ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లో కుల గణనకు శ్రీకారం చుట్టానని.. తెలంగాణలో అధికారంలోకి వస్తే ఇక్కడ కూడా కులగణన సర్వే చేయిస్తానని రాహుల్ హామీ ఇచ్చారు. KCR తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత వరకు దోచుకున్నారో కులగణన రిపోర్ట్ చెప్తుందని అన్నారు.
BRS, AIMIM BJPతో కలిసి తమపై ద్వేషపూరిత ఆరోపణలు చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ఇంకెప్పుడైనా ప్రధాని నరేంద్ర మోదీ కానీ.. KCR కానీ ప్రజల ముందుకు వచ్చి సభలు నిర్వహిస్తే ఎందుకు ఇంత వరకు తెలంగాణలో కులగణన చేపట్టలేదని ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీల నోరు నొక్కేయడానికి మోదీ అన్ని పార్టీలపై కేసులు పెడుతున్నారు కానీ KCRపై ఇప్పటివరకు ఒక్క ED కానీ CBI కానీ కేసు వేయలేదని ఇక్కడే వారు కలిసిపోయి ఉన్నారని స్పష్టంగా తెలుస్తోందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఒక సాధారణ వ్యక్తి రాష్ట్రానికి సీఎం అయితే బాగుంటుందని ప్రజలు కోరుకున్నారని కానీ తొమ్మిదేళ్లుగా కేసీఆరే సీఎంగా ఉంటున్నారని రాహుల్ తెలిపారు. ఆనాడు UPA ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కారణమైందని.. తనకు తెలంగాణ ప్రజల పట్ల కేవలం ప్రేమ మాత్రమే ఉందని.. కానీ KCR, మోదీలకు మాత్రం రాజకీయ అనుబంధం ఉందని అన్నారు.
రాహుల్ వ్యాఖ్యలపై BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (kalvakuntla kavitha) స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలపై అంత ప్రేమ ఉన్నప్పుడు గత 60 ఏళ్లలో ఎందుకు కులగణన సర్వే చేపట్టలేదని ప్రశ్నించారు. 2014లో KCR ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కులగణన సర్వే నిర్వహించారని కాకపోతే ఆ వివరాలు రూల్స్ ప్రకారం బయటపెట్టడానికి వీల్లేదని కవిత గుర్తుచేసారు.