చంద్ర‌బాబుపై కేసుల‌కు పురంధేశ్వ‌రి ప్రెస్ మీట్లే కార‌ణ‌మా?

TDP అధినేత చంద్ర‌బాబుపై (chandrababu naidu) ఈరోజు AP CID మ‌రో కేసును న‌మోదు చేసింది. TDP హయాంలో ఇసుక పాలసీలో అవకతవకలు జరిగాయంటూ కేసు న‌మోదు చేసారు. FIRలో పీతల సుజాత, చంద్రబాబు, చింతమనేని ప్రభాకర్‌, దేవినేని ఉమ పేర్లు ఉన్నాయి. ఇసుక అక్రమాలు జరిగాయని APMDC ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్ర‌బాబును AP CID A-2గా చేర్చింది.

ఇది చంద్ర‌బాబుపై న‌మోదైన ఐదో కేసు. అయితే చంద్ర‌బాబు నాయుడుపై ఏపీ ప్ర‌భుత్వం మొద‌ట‌గా వేసిన కేసు స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్‌కు (skill development case) సంబంధించిన‌ది. AP CID ఈ స్కాంలో చంద్ర‌బాబును అంతిమ ల‌బ్ధిదారుడు అని కోర్టులో వాదించ‌డం వ‌ల్లే ఆయ‌న రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో దాదాపు 50 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు.

ఆ త‌ర్వాత అంగ‌ళ్ల కేస‌ని.. పుంగ‌నూరు కేసుల‌ని మ‌రో రెండు కేసులు వేసారు. ఈ రెండు కేసుల్లో వెంట‌నే అరెస్ట్ చేయొద్ద‌ని కోర్టులు తెలిపాయి కూడా. అయితే ఈ కేసుల‌ను ఏపీ హైకోర్టు విచారించేందుకు రిజిస్ట‌ర్ చేసింది. ఎప్పుడైతే చంద్ర‌బాబుకు అనారోగ్యం కార‌ణంగా మ‌ధ్యంత‌ర బెయిల్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలిసిందో స‌రిగ్గా అప్పుడే చంద్ర‌బాబుపై నాలుగో కేసు న‌మోదైంది. అక్ర‌మంగా మ‌ద్యం కంపెనీల‌కు అక్ర‌మంగా అనుమ‌తులు ఇచ్చార‌ని ఆరోప‌ణ‌లూ చేస్తూ AP CID కేసు వేసింది. ఈ కేసులో చంద్ర‌బాబును A3గా చేర్చింది. ఈ కేసును AP ACB కోర్టు వాద‌న‌లు వినేందుకు అనుమ‌తించింది. రేపు ఈ కేసుపై చంద్ర‌బాబు నాయుడు త‌ర‌ఫు న్యాయ‌వాదులు కౌంట‌ర్ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

చంద్ర‌బాబుపై పెడుతున్న కేసుల‌కు ఆయ‌న బంధువు.. ఏపీ BJP రాష్ట్ర అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి (daggubati purandeswari) పెడుతున్న ప్రెస్‌మీట్లు కార‌ణ‌మ‌వుతున్నాయ‌ని జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను బ‌ట్టి చూస్తే అర్థ‌మ‌వుతోంది. కొన్ని రోజుల క్రితం మ‌ద్యం విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం త‌ప్పుల‌ను ఎత్తిచూపుతూ పురంధేశ్వ‌రి ప్రెస్ మీట్ పెట్టారు. మ‌ద్యం షాపుల యాజ‌మాన్యాల‌ను ప్ర‌జాక్షేత్రంలో పెట్ట‌గ‌ల‌రా అని YSRCP ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. ఈ ప్రెస్‌మీట్ జ‌రిగిన కొద్దిరోజుల‌కే చంద్ర‌బాబుపై లిక్క‌ర్ కేసు న‌మోదైంది.

ఆ త‌ర్వాత ఆమె రెండు రోజుల క్రితం అక్ర‌మంగా ఇసుక‌ల‌ను అమ్మేస్తున్నార‌ని.. ఎక్క‌డిక‌క్క‌డ త‌వ్వుకుని పోతున్నార‌ని అన్నారు. ఈ ప్రెస్ మీట్ జ‌రిగిన రెండు రోజుల‌కే అంటే ఈరోజే చంద్ర‌బాబుపై ఐదో కేసు న‌మోదైంది. సో పురంధేశ్వ‌రి YSRCP ప్ర‌భుత్వం త‌ప్పుల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయ‌డానికి ప్రెస్ మీట్లు పెడుతుంటే YSRCP ప్ర‌భుత్వం ఆమె లెవ‌నెత్తే అంశాల‌ను ఆధారంగా చేసుకుని చంద్ర‌బాబుపై కేసులు పెడుతోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.