AP Elections: “ఏందన్నా కొట్లాటకు వచ్చినారా?”
AP Elections: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి (jagan mohan reddy) పులివెందులలో (pulivendula) స్థానిక నేతల నుంచి వ్యతిరేకత ఎదురైంది. పులివెందులలో మండల స్థాయిలో, గ్రామాల స్థాయిలో సభ్యులను ఏర్పాటుచేసినప్పటికీ వారికి ఒరిగింది ఏమీ లేదని జగన్ ముందు వాపోయారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నిన్న జగన్ పులివెందులలోని సింహాద్రిపురంలో మండల స్థాయి భేటీ ఏర్పాటుచేసారు. ఈ భేటీలో పాల్గొన్నవారితో జగన్ ఏదో చెప్పబోతుండగా.. కొందరు నేతలు లేచి పదేళ్ల నుంచి పార్టీ జెండా మోస్తున్నామని అయినా తమకు పార్టీ నుంచి ఒరిగింది ఏమీ లేదని ఆవేదన వ్యక్తం చేసారు.
దాంతో ఇతర నేతలతో పాటు జగన్ కూడా అవాక్కయ్యారు. వారితో జగన్ ఏందన్నా కొట్లాటకు వచ్చినారా అని అన్నారట. “” కొట్లాట కాదన్నా.. మా బాధలు చెప్పుకోవడానికి వచ్చాం. సింహాద్రిపురంలో మనకు మెజారిటీ రాదు అని తెలుస్తోంది. బీటెక్ రవిని అరెస్ట్ చేయించడంతో పార్టీ గ్రాఫ్ మరింత పడిపోయింది. వివేకా హత్య కేసు వల్ల CBI గబ్బులేపింది. ఇలా అయితే కష్టమన్నా “” అని తమ బాధను చెప్పుకున్నారు. దీనిపై జగన్ స్పందిస్తూ నేను చూసుకుంటాలే అన్నా అని వారికి సర్దిచెప్పేందుకు యత్నించారు.
అయితే.. ఈ నెల 24, 25 తేదీల్లో జగన్ పులివెందులకు వచ్చి నేతలతో సమావేశం అవుతారని సమాచారం అందడంతో కొందరు నేతలు భేటీ తప్పించుకునేందుకు కాలి నడకన తిరుమల ప్రయాణం అయ్యారు. ఇదే విషయాన్ని ఇతర నేతలు జగన్‌కు చెప్పగా ఆయన మండిపడ్డారు. మండలాల నుంచి ఆశించిన సంఖ్యలో నేతలు రాలేదని జగన్ ఆరాతీసారు. తిరుమలకు ఇప్పుడే వెళ్లాలా? అని జగన్ ఇతర నేతలను ప్రశ్నించారు. ఇలా జగన్ సొంత అడ్డా అయిన పులివెందులలోనే వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.