The Kerala Story చూపిస్తే.. ముస్లిం కుర్రాడితో లేచిపోయింది!
Bhopal: భోపాల్ బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్‌కి (pragya thakur) ఓ యువతి షాకిచ్చింది. ముస్లిం యువకుడిని ప్రేమించిన ఓ హిందూ యువతి గురించి తెలుసుకున్న ప్రగ్యా ఠాకూర్.. స్వయంగా ఆ అమ్మాయిని తన ఇంటికి ఆహ్వానించి ది కేరళ స్టోరీ (the kerala story) సినిమా చూపించింది. అయినప్పటికీ ఆ అమ్మాయి తను ప్రేమించిన ముస్లిం యువకుడితోనే లేచిపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 19 ఏళ్ల యువతి యూసఫ్ అనే ముస్లిం యువకుడితో ప్రేమలో ఉంది. కానీ ఆ అమ్మాయికి ఇంట్లోవారు హిందూ అబ్బాయితో పెళ్లి ఫిక్స్ చేసారు. ఇందుకు ఆ యువతి ఒప్పుకోలేదు. దాంతో ఎలాగైనా తన కూతురి మనసు మార్చాలంటూ యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయం ప్రగ్యా ఠాకూర్‌కి తెలీడంతో తనే స్వయంగా ఆ యువతిని ఇంటికి తీసుకెళ్లింది.
కొందరు ముస్లిం యువకుల అకృత్యాలకు హిందువులు ఎలా బలైపోతున్నారో వివరించింది. అంతేకాదు.. ది కేరళ స్టోరీ సినిమాను కూడా చూపించింది. అయినా ఇవేమీ ఆ యువతి తలకెక్కలేదు. తను ప్రేమించిన యూసఫ్‌తో కలిసి లేచిపోయింది. ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం తీసుకెళ్లిపోయినట్లు తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆ యువతి ఇష్టపూర్వకంగా వెళ్లిపోతున్నానని లెటర్ రాసిపెట్టింది. పైగా యువతి మేజర్ కావడంతో వారి ప్రేమను కాదనే హక్కు ఎవ్వరికీ లేదు.