Ponnala Lakshmaiah: ఈ వయసులో అవమానాలు తట్టుకోలేను
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న తనకు ఇక సొంత పార్టీలోని నేతల వల్ల అవమానాలు ఎదుర్కొనే శక్తి లేదని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah). ఈరోజు ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు. ఇందుకు కారణం ఏంటని అడగ్గా.. పార్టీలోని నేతలు తన అభిప్రాయాలను అస్సలు పట్టించుకోవడం లేదని ఈ వయసులో అవమానాలు ఎదుర్కొనే శక్తి తనకు లేదని అన్నారు.
తాను కాంగ్రెస్ కోసం ఎంత కష్టపడి పనిచేసానో మీడియా వర్గాలకు కూడా తెలుసంటూ పార్టీకి రాజీనామా చేసినందుకు కాస్త ఉద్వేగానికి లోనయ్యారు. కాంగ్రెస్ మూడు సార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ తెలంగాణలో 50% ఓట్లు కూడా లేవని.. దాని కోసం ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టాలి అనే అంశం గురించి పార్టీ నేతలతో చర్చించాలనుకున్నానని కానీ మీటింగ్‌లు పెట్టినా ఎవ్వరూ కూడా హాజరుకాలేదని అన్నారు. ఇక విసిగిపోయిన తాను పార్టీకి రాజీనామా చేయడమే ఉత్తమం అనిపించిందని తెలిపారు. మరి ఇప్పుడు BRSలో చేరతారా అని అడగ్గా.. ఆయన మండిపడ్డారు. అలా ఎలా అడుగుతారని ఆగ్రహం వ్యక్తం చేసారు.