ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ కలకలం
Phone Tapping in AP: తెలంగాణలో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లోనూ ఫోన్ ట్యాపింగ్ కేసు కలకలం రేపుతోంది. ప్రభుత్వ మాజీ సలహా దారు సజ్జల రామకృష్ణారెడ్డి తన ఫోన్ ట్యాప్ చేయించారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ రావు ఆరోపించారు. అయితే గతంలో కూడా ఫోన్లు ట్యాపింగ్ చేసారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఆరోపించారు. కానీ అప్పట్లో ఎవ్వరూ పట్టించుకోవడంలేదు. ఇప్పుడు తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పలువురు అధికారులు, నేతలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బయటికి వచ్చి చెప్తున్నారు.
గతంలో ఫోన్ మాట్లాడాలంటే భయం వేసేదని.. ఇప్పుడు అధికారం మారింది కాబట్టి హాయిగా ఎవరితో అయినా ఫోన్లో మాట్లాడుకోవచ్చని ఊపిరి పీల్చుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కోసం ఆధునిక టెక్నాలజీని ఉపయోగించారని వారు వాపోయారు. ఆల్రెడీ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ రచ్చ జరుగుతోంది. నాడు అధికారంలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్.. ప్రతిపక్ష పార్టీ నేతలు, వ్యాపారవేత్తలు, నటీనటుల ఫోన్లు ట్యాప్ చేయించారని ఆయన కోసం పనిచేసిన అధికారులు విచారణలో వెల్లడించారు. ప్రస్తుతానికి ఈ కేసు విచారణ నెమ్మదిగా సాగుతుండడంపై ఎందుకీ ఆలస్యం అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.