Perni Nani: కార్యకర్త నుంచి జగన్ వరకు ఎవరి మీదైనా కేసులు పెట్టుకో
Perni Nani: వైఎస్సార్ కాంగ్రెస్‌కి చెందిన చిన్న స్థాయి కార్యకర్త నుంచి పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వరకు ఎవ్వరి మీదైనా కేసులు పెట్టుకో అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సవాల్ విసిరారు పేర్ని నాని. వైఎస్సార్ కాంగ్రెస్ నేత జోగి రమేష్ ఇంటిపై ఈరోజు ఏసీబీ దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో రమేష్ కుమారుడు రాజీవ్‌తో పాటు మరో కుటుంబ సభ్యుడిని అధికారులు అరెస్ట్ చేసారు. అగ్రి గోల్డ్‌కి సంబంధించిన భూములను కబ్జా చేసారన్న ఆరోపణల నేపథ్యంల ఈ సోదాలు, అరెస్ట్‌లు చోటుచేసుకున్నాయి.
దీనిపై పేర్ని నాని మాట్లాడుతూ.. “” చంద్రబాబు.. జోగి రమేష్ కుటుంబం ఉసురు నీకు తగులుతుంది. అతను తప్పు చేసి ఉంటే కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటాం అని అంటున్నాడు. అతనికి ఏమన్నా జరిగితే నీదే బాధ్యత. ఆ భూములు కొనుగోలు చేసే ముందు జోగి రమేష్ మీ ఈనాడు పత్రిలోనే ప్రకటన వేసాడు కదా. అప్పుడు రాని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చింది? జోగి రమేష్‌ను ఏమీ చేయలేక అతని కొడుకుని అరెస్ట్ చేసి శునకానందం పొందుతున్నావ్. ఎన్ని కేసులైనా పెట్టుకో. 175 నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్త, నేత, అధినేత జగన్ వరకు ఎవరిపై ఎన్ని అక్రమ కేసులైనా పెట్టుకో. కోర్టులున్నాయ్.. అక్కడే మాకు న్యాయం జరుగుతుంది “” అని హెచ్చరించారు.