Payyavula Keshav: పదేళ్లు కష్టపడితే జగన్‌కు ప్రతిపక్ష హోదా వస్తుంది
Payyavula Keshav: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాసిన సంగతి తెలిసిందే. తన పార్టీకి ప్రతిపక్ష హోదా కల్పించాలని ఆ లేఖలో కోరారు. ఈ లేఖపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందే నిర్ణయించేసినట్లున్నారని జగన్ లేఖలో రాసారని.. అది స్పీకర్‌ను హెచ్చరిస్తున్నట్లుగా ఉందని కేశవ్ అభిప్రాయపడ్డారు.
ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడానికి తమకు ఎలాంటి అధికారం లేదని.. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నప్పుడు స్పీకర్ మాత్రం ఏం చేస్తారని అన్నారు. 2019 ఎన్నికల సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు వచ్చినా అప్పటి అసెంబ్లీ స్పీకర్ ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు ఒప్పుకోలేదని అప్పటి రోజులను గుర్తుచేసారు.
“” జగన్ గారూ.. మీ స్నేహితుడు కేసీఆర్‌ను ప్రతిపక్ష హోదాకు సంబంధించిన రూల్స్ గురించి అడగండి. ఎప్పుడూ అకౌంట్స్ పుస్తకాలనే కాదు అప్పుడప్పుడూ ఇలాంటి రూల్స్‌కి సంబంధించిన పుస్తకాలను కూడా చదవాలి. అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్‌గా ఉండటం వేరు ప్రతిపక్ష హోదాలో ఉండటం వేరు. మీరు కేవలం ఫ్లోర్ లీడర్‌గా ఉంటారు కానీ ప్రతిపక్ష నేతగా కాదు. మీకు ప్రతిపక్ష హోదా కావాలంటే మరో పదేళ్లు జనాల్లోకి వెళ్లి కష్టపడి వారి నమ్మకాన్ని సాధించండి. అప్పుడు వస్తుంది హోదా. ఈ లేఖను మీ సలహాదారు చేత రాయించి ఉంటే ఆ సలహాదారుని మార్చండి. మీరే రాసి ఉంటే మీ ఆలోచనా విధానం మార్చుకోండి “” అని తెలిపారు.