EXCLUSIVE: ఇక తగ్గేది లేదు.. త్యాగం చేయాల్సిందే
Exclusive: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (ap elections) తెలుగు దేశం పార్టీ (TDP) జనసేన (janasena) పొత్తు పెట్టుకుని మరీ బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. 2019తో పోల్చుకుంటే ఇప్పుడు జనసేన కాస్త బలపడినట్లు కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఒంటరిగా దిగినందుకే జనసేన గెలవలేకపోయింది. ఈసారి ఆ రిస్క్ తీసుకోదలచుకోలేదు జనసేనాని పవన్ కళ్యాణ్ (pawan kalyan).
అందుకే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడంతో కనీసం భారతీయ జనతా పార్టీని సంప్రదించకుండా తానే తెలుగు దేశం పార్టీతోనూ పొత్తులో ఉన్నట్లు ప్రకటించారు. ఈ విషయంలో తన మాట భారతీయ జనతా పార్టీ వింటుందనే నమ్మకం ఉందని చెప్తున్నారు.
అయితే ఏపీలో వీక్‌గా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీనే. గెలవాలంటే ఒంటరిగా బరిలోకి దిగితే సరిపోదు. మరో స్ట్రాంగ్ పార్టీతో పొత్తు ఉండాలి. అందుకే తెలుగు దేశం పార్టీ, జనసేనతో కలవాలని చూస్తోంది. కానీ ఇందుకు చంద్రబాబు నుంచి సమాధానం లేదు. ఎక్కడ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే అధికారంలోకి వచ్చాక ఏ పదవి ఇవ్వాల్సి వస్తుందో ఏది వదిలేసుకోవాల్సి వస్తుందో అని బాబు అప్రమత్తంగా ఉన్నారు. అందుకే పవన్ మాతో కలవండి అని BJPని అడుగుతుంటే.. అది మీరు కాదు చంద్రబాబును చెప్పమనండి సంతోషంగా మీతో కలిసి బరిలోకి దిగుతాం అంటున్నారు.
త్యాగం చేయాల్సిందే
ఈసారి ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఏది ఏమైనా అసెంబ్లీలో అడుగుపెట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. అందుకే తెలుగు దేశం పార్టీ చెప్పినట్లు వింటూ వస్తున్నారు. అయితే సీట్ల షేరింగ్ విషయంలో మాత్రం పవన్ తగ్గేది లేదు అంటున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కొన్ని తాను త్యాగం చేస్తే ఇంకొన్ని తెలుగు దేశం పార్టీ త్యాగం చేయాల్సిందేనని మొహమాటం లేకుండా చెప్పేసారట. ఎంత చిన్న పార్టీ అయినా తాము కూడా ఏపీలో తమ సత్తా నిరూపించుకోవాలని అనుకుంటున్నట్లు చంద్రబాబుతో పవన్ చెప్పారు.