Pawan Kalyan: జ‌గ‌న్ గారూ.. తిట్ట‌కుండా వీటికి స‌మాధానం చెప్తారా?

Pawan Kalyan: ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలోనే రాష్ట్రంలో ఎందుకు కుల గ‌ణ‌న (caste census) నిర్వ‌హించాల‌ని అనుకుంటున్నార‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని (jagan mohan reddy) ప్ర‌శ్నించారు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. కుల గ‌ణ‌న అంశంపై త‌న‌కున్న సందేహాల‌ను ఒక లేఖ ద్వారా రాసి జ‌గ‌న్‌ను తిట్ట‌కుండా సమాధానం చెప్పాల్సిందిగా కోరారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అడిగిన 12 ప్ర‌శ్న‌లు ఇవే

1.ఈ కుల గ‌ణ‌న ఉద్దేశం మీకు ఎన్నిక‌ల ముందే ఎందుకు వ‌చ్చింది?

2.ఈ ప్ర‌క్రియ కార‌ణాలు వివ‌రిస్తూ ఎందుకు ఏ విధ‌మైన ప్ర‌భుత్వ ప‌ర‌మైన గెజిట్ నోటిఫికేష‌న్ రిలీజ్ చేయ‌లేదు?

3.ఇది రాజ్యాంగం మా అంద‌రికీ ఆర్టిక‌ల్ 21 ప్ర‌కారం చెప్పిన వ్య‌క్తిగ‌త‌ గోప్య‌త, భ‌ద్ర‌త, స్వేచ్ఛ హ‌రించ‌డం కాదా?

4.కుల‌గ‌ణ‌న మీ ఉద్దేశ‌మైతే.. ఉప‌కులం, ఆదాయం, భూమి యాజ‌మాన్య వివ‌రాలు, కోళ్లు, మేక‌లు, ఆవులు, గేదెలు ఈ వివ‌రాల‌న్నీ ఎందుకు?

5. బిహార్ ప్ర‌భుత్వం చేసిన కుల‌గ‌ణ‌న సుప్రీంకోర్టులో ఉన్న నేప‌థ్యంలో కోర్టు తీర్పు ప్ర‌క‌టించ‌క ముందే మీరు స్వీయ ప్ర‌యోజ‌నాల‌కు ప్ర‌జా ధ‌నాన్ని ఎందుకు వేస్ట్ చేస్తున్నారు?

6. జ‌న‌గ‌ణ‌న ఒక సంక్లిష్ట‌మైన ప్ర‌క్రియ‌. ఎంతో మంది నిపుణుల స‌మ‌క్షంలో చేయ‌వ‌ల‌సిన ప్ర‌క్రియ. మీ వాలంటీర్ల‌కు కుల గ‌ణ‌న చేసేందుకు సామ‌ర్ధ్యం ఉంద‌ని ఎలా నిర్ధారించారు?

7. ఇటువంటి డేటా సేక‌ర‌ణ ప్ర‌క్రియ గ‌తంలో కేంబ్రిడ్జ్ అన‌లిటికా చేసిన‌ప్పుడు అది ఏ విధంగా స‌మాజంలో అశాంతిని, అల్ల‌ర్ల‌కు ప్రేరేపించాయి అనే విష‌యం మీకు తెలీదా? వాటిని ఎన్నిక‌ల కోసం స్వీయ ప్ర‌యోజ‌నాల‌కు ఎలా వాడుకున్నారో మాకు తెలీద‌నుకుంటున్నారా?

8. ఇవ‌న్నీ మీ అధికార దాహానికి ప్ర‌తీక కాదా? ఒక వేళ మీ ఉద్దేశం ఇది కాక‌పోతే.. మీరు తీసుకున్న డేటా దుర్వినియోగం కాకుండా మీరు తీసుకుంటున్న జాగ్ర‌త్త‌లు ఏంటి?

9. ప్ర‌జ‌ల నుంచి డేటా స‌మ్మ‌తి అనేది మీరు ఎలా తీసుకుంటున్నారు? అంద‌రూ మీ నియంతృత్వానికి త‌ల వంచుతార‌ని అనుకుంటున్నారా?

10. ప్ర‌భుత్వ వ‌న‌రులు, ప్ర‌భుత్వ యంత్రాంగాన్ని మీ స్వీయ ప్ర‌యోజ‌నాల‌కు వాడుకోవడం, దేశ రాజ్యాంగానికి, ప్ర‌జాస్వామ్యానికి తూట్లు పొడ‌వటం కాదా?

11. వాలంటీర్ల ద్వారా ప్ర‌భుత్వం సేక‌రిస్తున్న కుల గ‌ణ‌న వివ‌రాలు ఏ కంపెనీ ద్వారా భ‌ద్ర‌ప‌రుస్తారు అనే అంశంపై శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాలి?

12. జ‌గ‌న్ చేస్తున్న రాజ్యాంగ వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల‌పై రాజ‌కీయంగానే న్యాయ‌ప‌ర‌మైన మార్గాల‌ను కూడా విశ్లేషించే దిశ‌గా ఆలోచిస్తాం.