Pawan Kalyan: మళ్లీ జగన్ వస్తే నన్ను చంపేస్తారా అని అడుగుతున్నారు
Pawan Kalyan: ఈసారి ఎన్నికల్లో తనకు ఓట్లు పడనంత మాత్రాన తాను గెలవనంత మాత్రాన ఏమీ చచ్చిపోనని అన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో పవన్ కాకినాడలో ప్రచారంలో పాల్గొన్నారు. మంచి నేతను మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోకపోతే ప్రజల జీవితాలు పోతాయి కానీ తనకు ఏమీ కాదని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ లాంటి గూండాగిరి పార్టీని ఎదుర్కోవాలంటే పవన్ ఒక్కడే వస్తే సరిపోదని.. ప్రతి పౌరుడి గుండెలో ధైర్యం ఉండాలని పిలుపునిచ్చారు. తాను తన కోసం ఓటు అడగడం లేదని.. ప్రజల భవిష్యత్తు కోసం పదేళ్లుగా పనిచేస్తున్నానని అన్నారు.
మళ్లీ జగన్ వస్తే తనని చంపేస్తారేమో అని ఓ ఇంటర్వ్యూలో తనని అడిగారని.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే ఓ దళిత సంఘం తరఫున పోరాడానని.. భగత్ సింగ్‌ని గుండెల్లో పెట్టుకున్న తనకు ఎలాంటి ప్రాణ భయం లేదని వెల్లడించారు. గూండాలకు భయపడేవారు పార్టీ ఎందుకు పెడతారని ప్రశ్నించారు. తాను బ్రతికున్నంత వరకు జనసేన పార్టీ నుంచి తన ప్రజాస్వామ్యం మాతృభూమి కోసం నిలబడతానని తెలిపారు. ఓట్ల కోసమో అధికారం కోసమో తాను రాజకీయాల్లోకి వచ్చి ఉంటే తనకు ప్రధాని నరేంద్ర మోదీ అండగా ఉన్నారని.. ఆయన్ను అడిగితే ఒక మంచి పదవి ఇప్పిస్తారని తెలిపారు.