సెక్రటేరియేట్​లోకి ఎమ్మెల్యే రాజా సింగ్​కు నో ఎంట్రీ!

Hyderabad: గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh)కు తెలంగాణ(Telangana) నూతన సెక్రటేరియేట్​(Secretariat) సాక్షిగా చేదు అనుభవం ఎదురైంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) నేతృత్వంలో సచివాలయంలో జరిగే గ్రేటర్ ప్రజాప్రతినిధుల సమావేశానికి హాజరయ్యేందుకు సెక్రటేరియట్కు వెళ్లిన ఆయనను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. మీటింగ్లో పాల్గొనేందుకు వచ్చానని చెప్పినా వినకపోవడంతో రాజాసింగ్ వెనుదిరిగారు. కొత్త సచివాలయం వద్ద అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ బహిష్కృత నేత, గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కొత్త సచివాలయంలోకి వెళ్లకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ ఆహ్వానం మేరకు గ్రేటర్ ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయనను భద్రతా సిబ్బంది సెక్రటేరియట్లోకి అనుమతించలేదు. దాంతో కాసేపు అక్కడే వెయిట్ చేసిన రాజాసింగ్ వారినుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో వెనుదిరిగారు. మీటింగ్ కు ఆహ్వానం పంపి మరీ అవమానించారని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తనను ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అఫీషియల్ ఇన్విటేషన్ ఉండీ ఎమ్మెల్యేనైన తననే భద్రతా సిబ్బంది అడ్డుకుప్పుడు సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా,  తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో సచివాలయంలో జరిగే గ్రేటర్ ప్రజాప్రతినిధుల సమావేశానికి ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కూడా ఆహ్వానం పంపినా ఆయన మాత్రం గేటు వరకు వచ్చి వెళ్లిపోయారని మంత్రి పేషీ ప్రకటించింది.