Nikki Haley: భారత్‌కు అమెరికాపై నమ్మకంలేదు.. నిక్కీ షాకింగ్ కామెంట్స్
Nikki Haley: అమెరికా అధ్యక్ష పోరులో రిపబ్లికన్ పార్టీ నుంచి బరిలో నిలిచిన భారత సంతతి అభ్యర్ధి నిక్కీ హేలీ అమెరికా సామర్ధ్యంపై చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. అసలు అమెరికాకు సామర్ధ్యం ఉందని భారత్ నమ్మడం లేదని ఆమె ఓ ఇంటర్వ్యూలో అన్నారు. భారత్ అమెరికాతో భాగస్వామ్యం అవ్వాలని చూస్తోంది కానీ ఇప్పటికైతే భారత్‌కు అమెరికా సామర్ధ్యంపై అస్సలు నమ్మకం లేదని ఆరోపించారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో అమెరికా కంటే బాగా పెర్ఫామ్ చేస్తున్న దేశం ఏదైనా ఉందంటే అది భారత్ మాత్రమే అని ఆమె అభిప్రాయపడ్డారు. రష్యాతో భారత్ మంచి సత్సంబంధాలను పాటిస్తోందని కానీ అమెరికాకు అది లేదని ఆమె ఆరోపించారు.
“” నేను భారత్‌తో కూడా డీల్ చేసాను. భారత్ మాతో కలవాలనుకుంటోంది. రష్యాతో కాదు. భారత్ కేవలం అమెరికాతో మాత్రమే కలవాలనుకుంటోంది. నేను భారత ప్రధాని నరేంద్ర మోదీని (Narendra Modi) కలిసినప్పుడు కూడా నాకు ఇదే అనిపించింది. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే.. అమెరికాకు సామర్ధ్యం లేదని భారత్ అనుకుంటోంది. మేం అమెరికాను నడిపించడం పట్ల భారత్ నమ్మకం కోల్పోతోంది. భారత్‌కు మేం బలహీనంగా ఉన్నామని అర్థమవుతోంది. భారత్ ఎప్పుడూ కూడా స్మార్ట్‌గా వ్యవహరిస్తుంటుంది. భారత్ ఎప్పుడూ కూడా రష్యాతోనే దోస్తీ చేస్తుంది. ఎందుకంటే మిలిటరీకి సంబంధించిన అన్ని ఆయుధాలు భారత్‌కు రష్యా నుంచే లభిస్తున్నాయి.
ఎప్పుడైతే మేం మళ్లీ ఉన్నత స్థాయికి వచ్చి మా సత్తా నిరూపించుకుంటామో అప్పుడు మా స్నేహితులైన ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మమ్మల్ని నమ్ముతాయి. ఇజ్రాయెల్, జపాన్, సౌత్ కొరియా కూడా అదే కోరుకుంటున్నాయి. జపాన్, ఇండియా చైనాపై ఆధారపడకుండా బిలియన్ డాలర్ల బలగాన్ని ఏర్పర్చుకున్నాయి. ఇప్పుడు అమెరికా ముందు ఉన్న లక్ష్యం ఒక్కటే. ఇతర దేశాలతో మళ్లీ ఆ సాన్నిహిత్యాన్ని పెంచుకోవాలి. ఆర్థిక పరంగా చైనా పరిస్థితి ఏమీ బాలేదు. అమెరికాతో చైనా యుద్ధం చేయాలని చూస్తోంది. అది చైనా చేస్తున్న పెద్ద తప్పు “” అని తెలిపారు.
నెవడా రాష్ట్రంలో నిక్కీ హేలీ ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మాత్రం నెవాడాలో పోటీ చేయలేదు. బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్ధుల పేర్లతో పాటు నోటా ఆప్షన్ కూడా ఇచ్చారు. ఆ నోటా ఆప్షన్‌కు ఎక్కువ ఓట్లు పడ్డాయి కానీ నిక్కీ హేలీకి మాత్రం ఓట్లు పడకపోవడం గమనార్హం. హేలీకి 31 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. కానీ నోటాకు మాత్రం 63 శాతం ఓట్లు పడ్డాయి. 1975లో నెవాడాలో నోటా ఆప్షన్‌ను ప్రవేశపెట్టారు. అప్పటినుంచి చూసుకుంటే ఒక అభ్యర్ధి కంటే నోటాకే ఎక్కువ ఓట్లు పడటం ఇదే తొలిసారి. దక్షిణ కారోలినాలో ఈ నెల 24న ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పోటీల్లో డొనాల్డ్ ట్రంప్, నిక్కీ హేలీ పోటీ పడనున్నారు.
నెవాడాలో ఓడిపోవడానికి ముందు నిక్కీ హేలీ లోవా, న్యూ హ్యాంప్‌షైర్‌లోనూ ఓడిపోయారు. నెవాడా ఆమెకు మూడో ఓటమిగా పరిగణించాలి. అయితే నెవాడాలో నిక్కీ ఓడిపోయినా పెద్దగా ప్రభావం ఏమీ ఉండదు. ఎందుకంటే అసలు అక్కడ ఇతర ఏ నేతలు కూడా పోటీ పడాలని అనుకోలేదు. రిపబ్లికన్ పార్టీ నుంచి నిక్కీ పోటీ చేస్తే కనీసం ఓట్లు ఆమెకే పడతాయని అనుకున్నారు కానీ వారు నోటాకి ఓటు వేసి నిక్కీ పరువు తీసేసారు. దక్షిణ కరోలినా నిక్కీ హేలీ స్వరాష్ట్రం. మరి ఇక్కడ ఆమెకు ఎన్ని ఓట్లు పడతాయో చూడాలి.