Nara Lokesh: మంచినీళ్లు అడిగితే ట్రాక్టర్ తో తొక్కించి చంపేస్తారా?!
Nara Lokesh: దేశంలో ఎక్కడా లేనివిధంగా పల్నాడులోని మాచర్ల ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం మల్లవరం తండాలో తాగునీటిని పట్టుకునేందుకు ట్యాంకర్ వద్దకు వచ్చిన గిరిజన మహిళ సామినిబాయి (50)ని YSRCPకి చెందిన ఓ వ్యక్తి ట్రాక్టర్‌తో తొక్కించి అత్యంత కిరాతకంగా చంపేసిన ఘటన సంచలనం సృష్టించింది. వారం రోజులుగా గుక్కెడునీరు దొరకని పరిస్థితుల్లో రాకరాక వచ్చిన ట్యాంకర్ వద్ద నీళ్లు పట్టుకోవడానికి వెళ్లిన గిరిజన మహిళలను మీరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు, నీళ్లు పట్టు కోవడానికి వీల్లేదని YSRCP నేత ఒకరు బెదిరించారు. (Nara Lokesh)
దీనిపై నారా లోకేష్ స్పందించారు. తాగునీటికి పార్టీలకు సంబంధమేంటని ప్రశ్నించడమే సామినీబాయి చేసిన నేరం. మాచర్లలో జరుగుతున్న వరుస ఘటనలు చూశాక మనం ఉన్నది ప్రజాస్వామ్యంలోనా, రాతియుగంలోనా అన్న అనుమానం కలుగుతోంది. వైసిపికి చెందిన సైకో ఊరంతా చూస్తుండగా స్వైరవిహారంచేస్తూ 3సార్లు ట్రాక్టర్ తో తొక్కించి సామినిబాయిని చంపేస్తే డ్రైవింగ్ రాకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని కేసుకట్టడం పతనమైన పోలీసువ్యవస్థకు పరాకాష్ట కాదా? కంచే చేనుమేసిన చందంగా కొంతమంది పోలీసులు అరాచకశక్తులతో ఏకమైతే సామాన్య ప్రజలకు దిక్కెవరు?! అని ప్రశ్నించారు.
పంచ భూతాలకు పార్టీ రంగులు పులిమే దుర్మార్గం రాజ్యమేలుతోంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాగు నీళ్లు పట్టుకునేందుకు కూడా పార్టీల లెక్కలు చూసే పరిస్థితి రావడం దురదృష్టకరం అని అన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మల్లవరంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన శ్రీమతి బాణావత్ సామునిబాయిని ట్రాక్టర్‌తో తొక్కించిన చంపిన ఘటన కలచి వేసిందని అన్నారు. ట్యాంకర్ దగ్గరకు తాగునీరు పట్టుకునేందుకు వెళ్తే ప్రతిపక్ష పార్టీవాళ్లు పట్టుకోరాదు అని అడ్డుపడటం.. ఇంట్లో నీళ్లు లేవని ఆమె ప్రాధేయపడ్డా వినకుండా ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపడం చూస్తే రాష్ట్రంలో ఎలాంటి దుర్మార్గపు పాలన నడుస్తోందో అందరూ అర్థం చేసుకోవాలని అన్నారు.
వైసీపీ వాళ్లు నీళ్లు తాగాలి.. గాలి పీల్చాలి అని జీవో ఇవ్వడం ఒక్కటే మిగిలి ఉందని సెటైర్ వేసారు. పంచ భూతాలకు పార్టీ రంగులు పులిమే దుర్మార్గం రాజ్యమేలుతోందని మండిపడ్డారు. మల్లవరం ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా, అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగకుండా విచారణ చేయాలని ఆదేశించారు. మూడేళ్ల క్రితం ఇదే తరహాలో పల్నాడు జిల్లాలోనే నకరికల్లు ప్రాంతంలో ఎస్టీ మహిళను వైసీపీ నాయకుడు ట్రాక్టర్‌తో తొక్కించి చంపేసాడని అప్పటి ఘటనను గుర్తుచేసారు. జగన్ మాట్లాడితే నా ఎస్టీలు.. నా ఎస్సీలు.. అంటాడని.. ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేస్తూ ఎస్టీ మహిళలను ట్రాక్టర్లతో తొక్కించేస్తూ హత్యాకాండ సాగించేవాళ్లను వెనకేసుకొచ్చే వ్యక్తికి నా ఎస్టీ, నా ఎస్టీ అనే అర్హత ఉందా అని ప్రశ్నించారు.
ALSO READ: Nara Lokesh: జగన్‌కు “గ్లాస్” విలువ తెలీదు
జరిగింది ఇదీ..!
మాచర్ల నియోజకవర్గం మల్లవరం ప్రాంతానికి శుక్రవారం ఉదయం నీటి ట్యాంకర్ వచ్చింది. ఆ సమయంలో ఎస్టీ వర్గానికి చెందిన బాణావత్ సామునిబాయ్ అనే మహిళ నీళ్లు పట్టుకోవాలని బిందె తెచ్చుకుంది. అక్కడే ఉన్న వైసీపీకి చెందిన సర్పంచ్ అనుచరుడు మణికంఠ నాయక్ నువ్వు నీళ్లు పట్టుకోవడానికి వీల్లేదు. ఇది మా ట్యాంకర్ అని ఆమెను అడ్డుకున్నాడు. ఇంట్లో నీళ్లు లేవయ్యా.. ఎండకు తట్టుకోలేకపోతున్నాం అని ఆమె ప్రాథయేపడినా అతను కనికరించలేదు. అంతటితో ఆగలేదు. అదే నీటి ట్యాంకర్‌ను ఆమె పైకి ఎక్కించేసాడు. దాంతో ఆమె చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం చనిపోయింది.