Nara Lokesh: జగన్‌కు “గ్లాస్” విలువ తెలీదు
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి (Jagan Mohan Reddy) సైకిల్, గాజు గ్లాస్ విలువ తెలీదని వ్యాఖ్యానించారు తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (AP Elections) ప్రచారం నేపథ్యంలో ఆయన గాజువాకలో శంఖారావం కార్యక్రమాన్ని ఏర్పాటుచేసారు. ఈ సందర్భంగా ఆయన ఈ విధంగా ప్రసంగించారు.
జగన్ పదే పదే సిద్ధం అంటున్నాడు. సిద్ధం అంటూ గంతులేస్తూ రాప్తాడుకు వెళ్లాడు. కానీ అక్కడున్న స్థానిక నేతలు మేం సిద్ధంగా లేం అని చెప్పారు. ఖాళీగా ఉన్న కుర్చీల ఫోటోలు తీస్తుంటే ఒక విలేకరిని ఎలా చితకబాదారో ప్రజలు కూడా చూసారు. YSRCP నాయకులు ఎలాంటి రౌడీలో ఇవన్నీ ఉదాహరణలు. ఒక ముఖ్యమంత్రి అంత పెద్ద సభ ఏర్పాటు చేస్తే ఆయన చేసిన మంచి పనులు చెప్పుకుంటాడు. కానీ మీరు ఆ సభ చూస్తే ఆయనొక గంట సేపు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ 100 సార్లు చంద్రబాబు నాయుడు జపం చేసాడు.
అప్పుడు నాకు అర్థమైంది. ఈ జగన్ ఆంధ్ర రాష్ట్రానికి పీకింది ఏమీ లేదు. అందుకే ఆయన కలలో కూడా హాయిగా పడుకోలేకపోతున్నాడు. కలలో కూడా చంద్రబాబు నాయుడే కనపడుతున్నారు. ఆ సభలో చాలా భారీ డైలాగులు చెప్పాడు. సైకిల్ గురించి మాట్లాడాడు. గ్లాస్ గురించి మాట్లాడాడు. ఏకంగా ఫ్యాన్ గురించి మాట్లాడాడు. జగన్ ఒక పెత్తందారు. ధనవంతుడు. ఆయనకు సైకిల్, గ్లాస్ విలువ తెలీదు. ఇక్కడున్న ప్రజలంతా ఒకటే ఆలోచించాలి. సైకిల్ అనేది పేదవాడి చైతన్య రథం. ఈరోజు గాజు గ్లాస్లో మనం టీ తాగుతాం. జగన్ మాత్రం బంగారం గ్లాసులో తాగుతాడేమో. అందుకే ఆయనకు గ్లాస్ విలువ తెలీదు. కానీ ఈరోజు అదే ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి.
ALSO READ: AP Elections: కుటుంబం నుంచి ఎవరో ఒకరికే టికెట్
రెక్కలు విరిగిన ఫ్యాన్‌ని మనం పీకి చెత్తబుట్టలో పడేస్తాం. ఈ ఫ్యాన్ వల్ల గత ఐదు సంవత్సరాలు మనం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామో మీకు చెప్పాలి. రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి ఆ ఫ్యాన్ ఉపయోగపడింది. భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉంది. యువత ఉద్యోగాలు, ఉపాధి లేక ఆ ఫ్యాన్ ఆత్మహత్యలు చేసుకునేదానికి పనికొచ్చింది. ఎన్నికల ముందు 2,30,000 పెండింగ్ పోస్ట్‌లు భర్తీ చేస్తాం అన్నారు. ప్రతి సంవత్సరం డీఎస్సీ ఏర్పాటుచేస్తాం అన్నాడు. గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు కూడా ఇస్తాం అన్నారు. ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ పోస్ట్‌లను భర్తీ చేస్తాం అని హామీ ఇచ్చి ఈరోజు మాట తప్పాడు జగన్.
నేను పాదయాత్ర చేస్తుంటే మా సొంత జిల్లా చిత్తూరులో మహిళలు నన్ను కలిసారు. ఒక తల్లి ఆవేదన చెప్పుకుంది. అన్నా జగన్‌ని నమ్మి నేను మోసపోయా. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మా బిడ్డకి ఈరోజు చదివించాను. అతను ఒక ఆఫీసర్ అవుతాడు లేదా కానిస్టేబుల్ అన్నా అవుతాడన్న ఆలోచనతో చదివించాను. ఈరోజు ఉద్యోగాలు లేవు. ఈరోజు మాకు ఆత్మహత్యే దిక్కు అని చెప్పింది. ఇక భవన నిర్మాణ కార్మికులు కూడా ఆత్మహత్య చేసుకునేదానికి ఆ ఫ్యాన్ పనికొస్తుంది. ఆ నాడు ఇసుక పాలసీ మారుస్తున్నాను. మెరుగైన పాలసీ తీసుకొస్తానని ఇసుకనే దూరం చేసాడు. భవన నిర్మాణ కార్మికులు పనిలోకి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు.
ALSO READ: Nara Lokesh: అంబటి రాయుడుని ఎంతిస్తావ్ అని వేధించారు