Nara Bhuvaneswari: ప్రశ్నిస్తే చంపేస్తున్నారు
Nara Bhuvaneswari: YSRCP నాయకులు ప్రశ్నిస్తే చంపేస్తున్నారని విమర్శించారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సతీమణి నారా భువనేశ్వరి. ఆమె చేపడుతున్న నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా చోడవరం నియోజకవర్గంలో సభ ఏర్పాటుచేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ YSRCP నేతలు నరరూప రాక్షసులు అని ఆరోపించారు.
వైసీపీ నాయకులు నరరూప రాక్షసుల్లా ప్రవర్తిస్తూ రాష్ట్ర ప్రజలపై దాడులు, హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రజలు తమకు జరిగిన అన్యాయంపై నోరెత్తి మాట్లాడినా వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం గ్రామంలో హంసవేణి అనే మహిళ చేతిపంపులో నీళ్లు రావడం లేదని, టీడీపీ నేతలకు ఫిర్యాదు చేసిందనే కోపంతో ఆమెపై వైసీపీ నాయకులు దాడి చేసి రెండు కళ్లు పీకేశారు. వైసీపీ నేతలకు మహిళలు, పురుషులు అనే తారతమ్యం తెలియదు..తమను ప్రశ్నిస్తే ఎవరినైనా చంపేస్తున్నారు..దాడులు చేస్తున్నారు. గతంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) కార్యకర్తలను కొట్టి చంపేశారు.
ALSO READ: Nara Bhuvaneswari: ఆంధ్రప్రదేశ్లో ఆకలి అనే పదం వినపడకూడదు
కల్తీ మద్యాన్ని ప్రశ్నించిన కార్యకర్తలను వైసీపీ నాయకులు పొట్టనబెట్టుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అక్రమాలను, అన్యాయాలను ప్రశ్నిస్తున్నారే కోపంతో చంద్రబాబును అరెస్టు చేసి 53రోజులు జైల్లో నిర్బంధించారు. చంద్రబాబు పై చేసిన ఆరోపణలకు నేటికీ ఒక్క ఆధారాన్ని కూడా ప్రభుత్వం చూపించలేకపోయింది. చంద్రబాబు ఇంట్లో కూర్చుని బటన్లు నొక్కే నాయకుడు కాదు…ప్రజల వద్దకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకుని వారికోసం కష్టపడి పనిచేసే నాయకుడు.
చంద్రబాబు పదవులు, ప్రజల ఆస్తులను ఆశించే నాయకుడు కాదు..మా కుటుంబం అలాంటి ఆలోచనలకు దూరంగా ఉంటుంది. వైసీపీ పాలనలో ఏపీ పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయి…రాష్ట్ర యువత నిరుద్యోగులుగా మారిపోయారు. జగన్ పాలనలో ఏపీని గంజాయి, కల్తీ మద్యం, ఇసుక మాఫియాలో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టాడు. రాష్ట్ర భావితరాల భవిష్యత్తును జగన్ నాశనం చేశాడు. రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి ఓట్లు వేయాలి…పదిమందిని ప్రోత్సహించి ఓట్లు వేయించాలి. చంద్రబాబు పాలనలో మహిళలకు మంచి మంచి పథకాలు రాబోతున్నాయి..మహిళలకు రక్షణ దొరుకుతుంది. రాష్ట్ర ప్రజలు ఓటు వేసే ముందు మీ పిల్లల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలి అని వెల్లడించారు నారా భువనేశ్వరి.
చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు దాదాపు 100 మంది గుండెపోటుతో మరణించారని తెలుగు దేశం పార్టీ చెప్తోంది. ఇది నిజమో అబద్ధమో తెలీదు కానీ నారా భువనేశ్వరి మాత్రం వారిని ఓదార్చేందుకు భువనేశ్వరి నిజం గెలవాలి అనే యాత్రను చేపట్టారు. చంద్రబాబు నాయుడు జైలు పాలయ్యారు అని తెలిసి గుండెపోటుతో మరణించిన వారి కుటుంబాలను కలుస్తూ వారిని ఓదారుస్తున్నారు. వారికి ఆర్ధిక సాయాన్ని ప్రకటిస్తున్నారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో ఎప్పుడూ లేనిది తొలిసారి నారా భువనేశ్వరి కూడా పర్యటనల్లో పాల్గొంటున్నారు.