Nijam Gelavali: ప్రజల ప్రశ్నలు.. భువనేశ్వరి సమాధానాలు
చంద్రబాబు నాయుడు (chandrababu naidu) జైల్లో ఉన్న నేపథ్యంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి (nara bhuvaneswari) నిజం గెలవాలి (nijam gelavali) పేరుతో అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఈరోజు తిరుపతిలో (tirupati) ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన ప్రజలు కొందరు భువనేశ్వరిని కొన్ని ప్రశ్నలు వేసారు. వాటికి భువనేశ్వరి ఈ విధంగా సమాధానాలు ఇచ్చారు.
చంద్రబాబు ప్రజల మధ్యే ఎక్కువగా ఉండేవారు. అలాంటిది ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారో మాకు ఏం చెప్పాలని అనుకుంటున్నారో తెలీడంలేదు. మాకు ఏమైనా చెప్పమని మీతో చెప్పారా మేడమ్?
ములాఖాత్‌లో మాకు ఇచ్చే సమయం 30 నిమిషాలు. ఆ 30 నిమిషాల్లో 25 నిమిషాలు రాష్ట్రం గురించి ప్రజల గురించే అడుగుతారు. చివరి ఐదు నిమిషాలు నా ముఖం వైపు చూసి లేదా కోడలు బ్రాహ్మణి ముఖం వైపు చూసి ఇంకేంటి అంటారు. ఆ పరిస్థితిలో నేను ఏమీ మాట్లాడలేకపోయేదాన్ని. ఎందుకంటే ఎక్కడ ఏం చెప్తే ఇంకా బాధపడతారో అని నా భయం. (nijam gelavali)
నాలుగున్నరేళ్లలో బయటికి రాని కేసులు సరిగ్గా ఎన్నికల ముందే ఎందుకు పెట్టారు? ఎన్నికలకు భయపడి చంద్రబాబును అరెస్ట్ చేయించారా?
మీ ప్రశ్నలోనే జవాబు ఉంది. లోకేష్ పాదయాత్రకు, భవిష్యత్తుకు గ్యారెంటీ ప్రోగ్రామ్‌కు వచ్చిన సక్సెస్ రేట్ చూసి అధికార ప్రభుత్వానికి ఎక్కడ ఓడిపోతామో అన్న భయం పట్టుకుంది. అందుకే అరెస్ట్ చేయించారు. లోకేష్ పాదయాత్రను కూడా ఆపాలనుకున్నారు కానీ అది వారి తరం కాదు. త్వరలో లోకేష్ మళ్లీ పాదయాత్ర మొదలుపెడతారు. మీరు రేపు ఎన్నికల్లో వేయాల్సిన ఓటు ఇప్పటి గురించి ఆలోచించి కాదు భవిష్యత్తు గురించి ఆలోచించుకుని వేయండి.
మీ తండ్రి ముఖ్యమంత్రిగా పనిచేసారు.. మీ భర్త కూడా ఒకప్పటి ముఖ్యమంత్రే. ఇక మీ కొడుకు లోకేష్ మంత్రి స్థానంలో ఉన్నారు. అంత గొప్ప స్థాయిలో ఉన్న మీరు ఈరోజు ఇలా బయటికి వచ్చి ఇబ్బందిపడుతున్నారు. ఎలా అనిపిస్తోంది?
నా తండ్రి నుంచి నాకు పౌరుషం వచ్చింది. ఇక నా భర్త నుంచి క్రమశిక్షణ, ఓర్పు అలవడింది. వారి స్ఫూర్తితోనే ముందుకు వెళ్తున్నాను.
ఒక వ్యక్తి అరెస్ట్ అయితే వారి ఇంట్లోని నలుగురు బయటికి వచ్చి ధర్నాలు, నిరసనలు తెలుపుతారు. కానీ చంద్రబాబు అరెస్ట్ అయితే యావత్ భారతదేశం బయటికి వచ్చింది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు నిరసనలు తెలిపారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?
ఈరోజు ఐటీ వచ్చిందంటే అందుకు చంద్రబాబే కారణం. ఆయన ఐటీ ద్వారా ఉద్యోగుల జీవితాల్లో జ్యోతిని నింపారు. సంతోషాన్ని తీసుకొచ్చారు. అందుకే వారు చంద్రబాబుకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ వచ్చారు. మున్ముందూ మాతో కలిసి నడుస్తారు. (nijam gelavali)
చంద్రబాబు నాయుడుకు పంపించే ఆహారంలో విషం పెడుతున్నారు అని ఆరోపించారు. అది విని మీరు ఎలా తట్టుకున్నారు?
నేను రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకుని చాలా నేర్చుకున్నాను. ఎన్నో సమస్యలు కూడా ఎదుర్కొన్నాను. ఫర్వాలేదు. పనిలేని వాళ్లు చేస్తున్న ఆరోపణల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు.