Naga Babu: ప‌వ‌న్ భార్య‌ను అన్న‌ప్పుడు మ‌హిళా క‌మిష‌న్ ఎక్క‌డ‌?

AP: అంధ్రప్రదేశ్ వాలంటీర్ వ్యవస్థ, మిస్సింగ్ కేసులపై జ‌నసేన (janasena) జనరల్ సెక్రెటరీ నాగ‌బాబు (naga babu) స్పందించారు. ఏపీలో వాలంటీర్ల (ap volunteers) వ్య‌వ‌స్థ వ‌ల్ల 18వేల మంది అమ్మాయిలు క‌నిపించ‌కుండాపోయారని జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న కామెంట్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై నాగ‌బాబు స్పందించారు. ప‌వ‌న్ అబ‌ద్ధం చెప్ప‌డ‌ని, ఆయ‌న మాట‌ల‌కు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లుగా తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని అన్నారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ్యూమ‌న్ ట్రాఫికింగ్ వ‌ల్ల మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న ప‌రిస్థితుల గురించి మాట్లాడారు. ఇంకా దొర‌క‌ని వేలాది మంది ఆడ‌ప‌డుచులు.. వాళ్ల‌లో మ‌న చెల్లి, తల్లి, బిడ్డ ఉండొచ్చు. ఇంకా ఆచూకీ ల‌భ్యం కాని ఆడ‌పిల్ల‌లు ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉన్నారు? చ‌నిపోయారా? బ‌తికున్నారా? వారి అవ‌య‌వాల‌ను అమ్ముకున్నారా? లేదా వ్య‌భిచార గృహాల్లో న‌ర‌కం అనుభ‌విస్తున్నారా? వాళ్లు ఎలా ఉన్నా ఏ చావు చచ్చినా ఫ‌ర్వాలేదు కానీ ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌ల్లో జ‌రుగుతున్న అవ‌క‌త‌వ‌క‌ల‌ను స‌రిచేసుకోమంటే మాత్రం జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి పొడుచుకొచ్చింది. ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌ల‌ను స‌రిచేసుకోమ‌ని చెప్పే హ‌క్కు మ‌న‌కి లేద‌ట‌. వాళ్లు ఏం చేసినా భ‌రించాలి. మ‌న స‌మాజంలో జ‌రుగుతున్న దుర్మార్గపు ప‌నుల్లో హ్యూమ‌న్ ట్రాఫికింగ్ చాలా డేంజ‌ర‌స్. అందులో చిక్కుకున్న ఆడ‌పిల్ల‌లు ఏమైపోయినా మ‌న‌కు ఫ‌ర్వాలేదు. ఈ త‌ప్పు మీరు చేస్తున్నారు అని ప్ర‌భుత్వానికి చెప్ప‌డం పెద్ద త‌ప్పు అయిపోయింది. ఇదెక్క‌డి న్యాయం. ప‌వ‌న్ ఒక విజిల్ బ్లోయ‌ర్ లాంటివాడు. 2019లో వైసీపీ వ‌స్తే ఆ కొండా నాదే ఈ స్థ‌లం నాదే అని జ‌గ‌న్ అంటాడ‌ని అప్పుడే చెప్పాడు. ఇప్పుడు అదే జ‌రిగింది

ప‌వ‌న్ త‌ప్పు ప‌ట్టింది వాలంటీర్ల‌ను కాదు వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను. ఇప్పుడు పోలీసుల వ్య‌వ‌స్థ స‌రిగ్గా ప‌నిచేయ‌డం లేదు అంటారు. దాని అర్థం పోలీసులు త‌ప్పు అని కాదు క‌దా..? ఆడ‌పిల్ల‌ను ఏడిపించార‌ని ఓ కుర్రాడు వెళ్లి నిల‌దీస్తే త‌గ‌ల‌బెట్టి చంపేసారు. దాని గురించి మాట్లాడ‌టానికి మ‌హిళా క‌మిష‌న్ రాలేదు. ప‌వ‌న్ భార్య గురించి నోటి కొచ్చిన‌ట్లు మాట్లాడిన‌ప్పుడు ఏమైపోయింది? ప‌వ‌న్ ఎప్పుడూ అబ‌ద్ధం చెప్ప‌డు. అత‌ని వ్యాఖ్య‌ల ప‌ట్ల మేం క‌ట్టుబ‌డి ఉన్నాం. ఎన్ని నోటీసులు వ‌చ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాం అని తెలిపారు నాగ‌బాబు.