కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి రజినీ.. జగన్ రియాక్షన్ ఇదీ!
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ఇవాళ (గురువారం) ‘ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం’ ప్రారంభోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆరోగ్యశాఖ మంత్రి కావడంతో ఇందులో విడదల రజిని పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం వైఎస్ జగన్ గురించి మాట్లాడుతూ.. ఒక్కసారిగా మంత్రి రజినీ కంటతడి పెట్టారు. దీంతో అప్పటి వరకూ ఈలలు, కేకలతో మార్మోగిన సభలో ఒక్కసారిగా అందరూ మౌనంగా ఉండిపోయారు. ఒక నిమిషం తర్వాత ఆ భావోద్వేగం నుంచి తేరుకున్నాక మళ్లీ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు మంత్రి. ‘ చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరి సాక్షిగా చెబుతున్నా. నా రాజకీయ జీవితం, ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి జగనన్న పెట్టిన భిక్షే. సాధారణ బీసీ మహిళ అయిన నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇవ్వడంతోపాటు మంత్రిని చేశారు. జగనన్నా.. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా.. మీ ఆలోచన అమలే ధ్యేయంగా, మీ ఆదర్శాలే ఆచరణగా, మీ నాయకత్వమే నా అదృష్టంగా, మీరు నాకు అప్పగించిన ఈ కర్తవ్యాన్ని నేను నిజాయితీగా నిర్వర్తిస్తూనే ఉంటాను’ అని రజిని భావోద్వేగంతో కంటతడి పెట్టారు. రజిని మాటలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. రజిని ఎమోషనల్ అయ్యేసరికి జగన్ కూడా కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. అక్కడికి వచ్చిన యువత ఈలలు, కేకలతో హోరెత్తించారు. ‘జై జగన్.. జై జై రజిని అక్క’ అంటూ కార్యకర్తలు, అభిమానులు నినాదాలు చేశారు. ఇంకొందరు జై జగన్ అంటూ ప్లకార్డులు పట్టుకుని హడావుడి చేశారు.
చంద్రబాబు గురించి అప్పట్లో ఇలా..
గతంలో టీడీపీ కార్యకర్తగా, మహిళా నాయకురాలిగా విడదల రజినీ పనిచేశారు. ఆ సమయంలో మహానాడు కార్యక్రమంలో ఆమెకు మాట్లాడే అవకాశం వచ్చింది. అప్పడు చంద్రబాబు గురించి ఆమె ఏమన్నారంటే… ‘సార్.. అభిమానంతో నేను ఒక మాట చెబుదాం అనుకుంటున్నాను.. ఒక్కసారి నావైపు చూడండి. నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాను. దాదాపు వెయ్యి కోట్ల బిజినెస్ రన్ చేస్తున్నాను. 200 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. మన వాళ్లే కాకుండా, విదేశీయులు కూడా పనిచేస్తున్నారు. అటువంటి అవకాశం నేను ఇచ్చాను. ది బెస్ట్ అయిన నేను.. మీ దగ్గరుండాలి అని నేను ఇక్కడికి వచ్చాను. ఇది నా గుండెల్లో నుంచి వచ్చిన మాట. మీరు ఎప్పుడూ అభివృద్ధి, అభివృద్ధి అంటుంటారు. మీరు సైబరాబాద్‌లో పెట్టిన చెట్టు మొక్క సార్ నేను. అలా సైబర్ టవర్స్‌లో ఎదిగి.. మీ ముందు నేను ఇలా అయ్యాను’ అని బాగా ఎమెషనల్ అయ్యారు. ఇక ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఆమె ఏకంగా.. సీఎం జగన్ గురించి మాట్లాడుతూ.. కంటతడి పెట్టారు.