కుక్కల నియంత్రణకు చర్యలు – GHMC మేయర్
హైదరాబాద్‌లో వీధి కుక్కలు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. గతంలో నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసిన సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో జీహెచ్‌ఎంసీ మేయర్, అధికారులు స్పందించారు. వీధి కుక్కల కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈమేరకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయగా.. ఇప్పుడు ఆ కమిటీ మేయర్‌కు ఓ నివేదికను అందజేసింది. వీధి కుక్కలను ఏ విధంగా కట్టడి చేయాలని అన్న అంశాలను ఆ నివేదికలో పేర్కొంది. అందులో సుమారు 26 అంశాలు కమిటీ పేర్కొనగా… ప్రస్తుతానికి 25 అంశాల అమలుకు మేయర్ చర్యలు తీసుకుంటానని తెలిపారు. మంగళవారం సాయంత్రం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో జోనల్ కమిషనర్లు, శానిటేషన్ అడిషనల్ కమిషనర్, హైలెవల్ కమిటీ సభ్యులతో కలిసి మేయర్ సమీక్షించారు.
ప్రత్యేక వాహనాల్లో వ్యర్థాల తరలింపు..
హైదరాబాద్ మహా నగరంలో హోటళ్లు, ఫంక్షణ్ హాళ్లు అధికంగా ఉన్నాయి.. దీంతో ఆయా ప్రాంతాల్లో వ్యర్థాలు పేరుకుపోతున్నాయని పలువురు కార్పొరేటర్లు మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతోపాటు వ్యర్థాలను తీసుకెళ్లే వాహనాలు తక్కువగా ఉన్నాయని.. వాటి సంఖ్యను పెంచాలని కార్పొరేటర్లు కోరారు. సి అండ్ డి వ్యర్థాలు కూడా వెనువెంటనే తీసుకొని పోవడం లేదని కార్పొరేటర్లు ఆరోపించారు. దీనినై స్పందించిన మేయర్.. వారం రోజుల్లో సర్కిల్ కు రెండు చొప్పున, చిన్న, పెద్ద వాహనాలు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని మేయర్ ఆయా ఏజెన్సీలను ఆదేశించారు. దీంతోపాటు కుక్కల నియంత్రణకు హైలెవల్ కమిటీ సిఫార్సు చేసిన అంశాల అమలుకు ఆదేశాలు.. గ్రేటర్ పరిధిలో కుక్కల నియంత్రణకు ఏర్పాటైన కమిటీ సభ్యులు సిఫార్స్ చేసిన 26 అంశాలలో 25 అంశాలు అమలు చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఆర్థికపరమైన అంశాలను కౌన్సిల్ లో తీర్మానం చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపుతామని తెలిపారు. మిగిలిన అంశాలు వెంటనే అమలు చేసేందుకు అధికారులను కోరామన్నారు. కుక్కల నియంత్రణ చర్యలతో పాటు శానిటేషన్ మెరుగుపరిచేందుకు రానున్న రోజుల్లో చర్చిస్తామని మేయర్ పేర్కొన్నారు. కుక్కల నియంత్రణకు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని మేయర్ అన్నారు. హోటల్, ఫంక్షన్ హాల్స్, రెస్టారెంట్ల ఆహార వ్యర్థాలను వెంటనే తరలించేందుకు ఒక్కొక్క హోటల్ కు, ఫంక్షన్ హాల్ కు ఒక వాహనం కేటాయించాలని అదేవిధంగా హోటళ్లు, ఫంక్షన్ హాల్స్ వివరాలను సేకరించి నివేదిక అందజేయాలని శానిటేషన్ ఇన్చార్జి అడిషనల్ కమిషనర్ ను ఆదేశించారు. రాంకీ ద్వారా సెకండరీ చెత్త సేకరణ మరింత మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు.