US: మిస్టర్ బైడెన్.. లాక్‌డౌన్ వరకు తెచ్చుకోవద్దు.. చైనాపై ఆంక్షలు విధించండి
US: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) నిబంధనలు జారీ చేసే వరకు ఆగొద్దని.. అమెరికాకు మరో లాక్‌డౌన్ పరిస్థితి ఎదురుకాకముందే చైనా (china) అమెరికా మధ్య పర్యాటనలపై నిషేధం విధించాలని కోరారు రిపబ్లికన్ సెనేటర్ల అధినేత మార్కో రూబియో (marco rubio). గతంలో చైనా నుంచి కోవిడ్ వ్యాపించినప్పుడు కూడా చైనా ముందే హెచ్చరించకుండా…ఈ వైరస్ గురించి సరైన చర్చలు జరపకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం చేకూర్చిందని.. ఇప్పుడు అక్కడ నుమోనియా వైరస్ కేసులు ఎక్కువవుతున్నా కూడా చైనా ఏమీ చెప్పకుండా నాటకాలు ఆడుతోందని రూబియో మండిపడ్డారు. అమెరికాలో మళ్లీ చావులు, లాక్‌డౌన్, ఆర్థిక నష్టం వాటిల్లక ముందే అమెరికా చైనా దేశాల మధ్య పర్యటనలపై నిషేధం విధించాలని లేఖ రాసారు.
చైనాలో ఉన్నట్టుండి పిల్లల్లో నుమోనియా కేసులు ఎక్కువవుతున్నాయి. అది కచ్చితంగా నుమోనియా అని కూడా వారు చెప్పలేకపోతున్నారు. దాంతో మళ్లీ ఏ కోవిడ్ లాంటి వైరస్‌ను అంటిస్తారో అని ఇతర దేశాలు కూడా భయపడుతున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు చైనా నుంచి రాకపోకలను నిషేధించాయి. భారత్ కూడా అప్రమత్తంగా ఉంది. ఈ వైరస్‌పై చైనా ఆరోగ్య శాఖ మంత్రి స్పందిస్తూ.. ఇది అన్ని దేశాల్లో ఉన్న సమస్యే అని.. నిర్మూలించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇతర దేశాలకు చెందిన వారు చైనాకు ఎటువంటి భయం లేకుండా రావచ్చని.. వారికి ఎలాంటి ప్రమాదం లేదని అంటున్నారు. కానీ కోవిడ్ వైరస్ సృష్టించిన విధ్వంసం చూసాక ఇక చైనా మాటలు ఎవరు వింటారు చెప్పండి..!