liquor scam: క‌వితక్క కోసం వేయిటింగ్ అంటున్న సుఖేష్‌

Delhi: ఢిల్లీ లిక్కర్‌ స్కాం(delhi liquor scam)లో ఇప్పుడు వాట్సప్‌ చాట్‌ల గొడవ మరింత ముదురుతోంది. ఇప్పటికే మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుఖేష్‌ చంద్రశేఖర్ (sukesh chandrasekhar) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (brs mlc kavitha) టార్గెట్‌గా లేఖలు రాస్తున్నాడు. ఇటీవల కవితతో చాట్‌ చేసిన రెండు చాట్‌ల స్క్రీన్‌ షాట్‌లను సుఖేష్‌ విడుదల చేశారు. దీనిపై స్పందించిన కవిత.. అసలు తనకు సుఖేష్‌ ఎవరో తెలియదని.. సమాధానమిచ్చారు. తాజాగా కవితకు సంబంధించి అయిదు పేజీల లేఖను సుఖేష్‌ రిలీజ్ చేశాడు. లేఖలో కవిత ప్రస్తావించిన విషయాలకు సమాధానం చెబుతూ.. ఆమె నంబర్‌తో ఉన్న స్క్రీన్ షాట్లు రిలీజ్ చేయడం సంచలనంగా మారింది. దమ్ముంటే విచారణను ధైర్యంగా ఎదుర్కోండి అంటూ ఛాలెంజ్ చేశాడు.

సుఖేష్‌ లేఖపై స్పందించిన ఇతర బీఆర్‌ఎస్ నాయకులు.. అసలు అతనికి తెలుగులో రాయడం ఎలా సాధ్యపడింది? ఎవరో కుట్రపూరితంగా ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై కూడా సుఖేష్‌ సమాధానం ఇచ్చాడు. తన మాతృభాష తెలుగు, తమిళం అని, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు తెలుగు, తమిళంలో మాట్లాడేవారని.. అలా తెలుగు కూడా తనకు వచ్చని అతను చెప్పుకొచ్చాడు. జైలు నుంచి సుఖేష్‌ ఈ చాట్‌లను ఎలా యాక్సెస్ చేయగలడనే ప్రశ్నపై అతను ఇలా స్పందించాడు. ఫోటోలు వీడియోలు తన బృందం ఆధీనంలో ఉన్నాయని.. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల అభ్యర్థన ఆధారంగా, బయట ఉన్న నా బృందం అన్ని ఆధారాలను అందజేస్తుందన్నారు. “ఎల్లప్పుడూ కవితను నా అక్కగా గౌరవిస్తాను. ధైర్యం ఉంటే సరైన రీతిలో, సక్రమంగా విచారణ జరిగేలా సహకరించాలి” సుఖేష్‌ చెప్పుకొచ్చాడు. ఇక కవితకు రూ. 15 కోట్ల డెలివరీ చేసిన తర్వాత ఫేస్‌టైమ్‌లో దిల్లీ సీఎం కేజ్రీవాల్(Kejriwal), సత్యేంద్రజైన్‌తో మాట్లాడిన స్క్రీన్ షాట్స్‌ను విడుదల చేస్తానని సుఖేష్‌ అంటున్నాడు. తీహార్ జైల్లో(tihar jail)కవితక్క, కేజ్రీవాల్‌ కోసం ఎదురుచూస్తున్నానని అతను చెప్పడం చర్చనీయంశంగా మారింది.