
Lakshmi Parvathi: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన ఆరోపణలు చేసారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మీ పార్వతి. తిరుమల లడ్డూపై లేనిపోని అబద్ధాలు సృష్టించి శ్రీవారితో ఆటలాడుతున్నాడని అన్నారు. ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నప్పుడు ఆ రోజు అసెంబ్లీలో తనకు దేవుడంటే అసలు నమ్మకం లేదని.. తన కృషిని నమ్ముకుని ప్రజల కోసం కష్టపడి పని చేస్తానని చెప్పి.. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మా దేవుళ్లు మా మనోభావాలు అంటూ నాటకాలాడుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలకు ఇతర అమ్మాయిలతో సంబంధాలు అంటగడుతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు అసలైన ఉమెనైజర్ (ఆడవాళ్ల పిచ్చి ఉండటం) అని ఆరోపించారు. ఈ విషయం ఎన్టీఆర్‌కి కూడా తెలుసని.. ఆయన అప్పట్లో తనకు చెప్పుకుని చాలా బాధపడ్డారని అన్నారు.
కాలేజ్ హాస్టల్‌లో సీక్రెట్ కెమెరాలు పెడుతున్నారు అని ఆడపిల్లలు ఏడుస్తుంటే అందులో ఎలాంటి నిజం లేదని చెప్పిన ఈ వ్యక్తి ఈరోజు తిరుమలను తన స్వలాభం కోసం వాడుకుంటున్నాడంటే ఏమనాలో కూడా అర్థంకావడంలేదని అన్నారు. తన హెరిటేజ్ ఫుడ్స్‌కి మంచి లాభాలు రావాలని విజయా పాలతో పాటు ఇతర ప్రముఖమైన డైరీ సంస్థలను ఎదగనివ్వకుండా చేసిన ఈ నీచుడికి శ్రీవారి పేరు పలికే అర్హత కూడా లేదని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు రాష్ట్రంలో అడుగుపెడితే జనాలు చచ్చిపోతుంటారని… ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ సర్వనాశనమే అవుతోందని అన్నారు. ఇక చంద్రబాబు నాయుడు ఆ దేవుడే కాదు ఎవ్వరూ క్షమించరు అని అన్నారు.