Kumaraswamy: తెలంగాణ ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి

క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్‌కి చెందిన 135 కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తున్నారు క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి (kumaraswamy). మొన్న జ‌రిగిన క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో  (karnataka elections) కాంగ్రెస్ ఓట‌ర్ల‌కు ఉచిత కానుక‌లు ఇచ్చి ప్ర‌లోభ‌పెట్టి వారి చేత ఓట్లు వేయించుకుంద‌ని చెప్తూనే ఉన్నానంటూ ట్వీట్ చేసారు.

“” నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా. క‌ర్ణాట‌క‌లోని కాంగ్రెస్ వ‌ర్గాలు ప్ర‌జ‌ల‌కు కుక్క‌ర్లు, ఇస్త్రీ పెట్టెలు వంటివి కానుక‌గా ఇచ్చి వారి చేత ఓట్లు వేయించుకున్నారు అని. ఈ విష‌యాన్ని ఇప్పుడున్న సీఎం సిద్ధారామ‌మ్య కుమారుడే ఓసారి స్వ‌యంగా వెల్ల‌డించారు. ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాలు ప‌క్క‌న‌పెడితే.. సీఎం సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే ఎన్నో కానుక‌ల‌ను ప్ర‌జ‌లకు ఇచ్చి వారి చేత ఓట్లు వేయించుకున్నారు. సిద్ధారామ‌య్య చేస్తున్నాడు క‌దా అని ఆయ‌న్ను చూసి ఇత‌ర ఎమ్మెల్యేలు కూడా కానుక‌లు ఇవ్వ‌డం మొద‌లుపెట్టారు.

అమృత్ మ‌హోత్స‌వ్ స‌మ‌యంలో కూడా కాంగ్రెస్ ఇలాంటి అతిపెద్ద మోసానికి పాల్ప‌డి ఓట్లు వేయించుకోవ‌డం బాధాక‌రం. ఇది ప్ర‌పంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అయిన భార‌త్ గ‌ర్వ‌కారణాన్ని హ‌త్య చేయ‌డ‌మే అవుతుంది. వెంట‌నే ఎన్నిక‌ల క‌మిష‌న్ ఈ అంశంపై క్షేత్ర‌స్థాయిలో విచార‌ణ చేసి కాంగ్రెస్‌కి చెందిన మొత్తం 135 ఎమ్మెల్యేల‌ను స‌స్పెండ్ చేయాలి. కేంద్ర ప్ర‌భుత్వం కూడా విచార‌ణ చేప‌ట్టి రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కూల‌దోయాలి. పూర్తి ఎన్నిక‌ల విధానాన్ని కాంగ్రెస్ పార్టీ నేత‌లు ప‌క్క‌దోవ ప‌ట్టించారు. ఇప్పుడు ఇదే క‌ర్ణాట‌క విధానాన్ని ఇత‌ర రాష్ట్రాల్లో కూడా అమ‌లు ప‌ర‌చాల‌ని చూస్తున్నారు. ప్ర‌జాస్వామ్యాన్ని విషం పెట్టి చంపుతున్న ఈ కాంగ్రెస్ ధోర‌ణిని ఇత‌ర రాష్ట్రాల ప్ర‌జ‌లు అడ్డుకోక‌పోతే ఘోరాలు జ‌రిగిపోతాయ్ “” అని మండిప‌డ్డారు కుమార‌స్వామి. (kumaraswamy)