Telangana: పాదయాత్ర చేయనున్న KTR కొడుకు?
Telangana: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడు హిమాన్షుతో తెలంగాణలో పాదయాత్ర చేయించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన భారత రాష్ట్ర సమితి అటు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. దానికి తోడు ఒక్కొక్కరుగా భారత రాష్ట్ర సమితిని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. దాంతో ఇంకో ఏడాది తర్వాత తెలంగాణలో అసలు పార్టీ ఉంటుందా లేదా అనే విషయంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ తన కుమారుడి చేత పాదయాత్ర చేయించి మళ్లీ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా రాజకీయాల్లో పాదయాత్రకు విశిష్టమైన ఆదరణ ఉంది. అసలు పార్టీ ఆనవాళ్లు ఉన్నాయా అనే స్థాయి నుంచి నేడు రాష్ట్రాలను ఏలేంతగా కొన్ని పార్టీలు ఉన్నాయంటే అందుకు పాదయాత్రలే కారణం. రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్, నారా లోకేష్ వీరంతా పాదయాత్రలు చేసి గెలిచినవారే. అందుకే కేటీఆర్ కూడా ఈ పాదయాత్రను చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు మన తెలుగు రాష్ట్రాల్లో ఏదన్నా పార్టీ ఇంకా పాదయాత్ర చేపట్టలేదు అంటే అది భారత రాష్ట్ర సమితే. అయితే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా పాదయాత్ర చేయాలనుకున్నారు కానీ ఆయన తుంటికి సర్జరీ జరగడంతో ఆ నిర్ణయాన్ని మానుకున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే హిమాన్షు రావు అక్టోబర్ 2 నుంచే పాదయాత్ర చేపట్టే అవకాశం ఉంది. ఈ పాదయాత్ర రెండేళ్ల పాటు జరగనుంది.