Formula E: అయిపోయింది.. అంతా అయిపోయింది.. KTR మండిపాటు

Formula E: హైద‌రాబాద్‌లో జ‌ర‌గాల్సిన Formula E రేస్‌ను ఆ సంస్థ ర‌ద్దు చేసుకుంది. ఫిబ్ర‌వ‌రి 10న ఈ కార్ల రేసింగ్ హైద‌రాబాద్‌లో జ‌ర‌గాల్సి ఉండ‌గా.. అది క్యాన్సిల్ అయింద‌ని చెప్తూ Formula E ప్ర‌కటించింది. దీనిపై BRS వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ KTR మండిప‌డ్డారు. తాను క‌ష్ట‌ప‌డి ఒప్పించిన రేస్‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం ర‌ద్ద‌య్యేలా చేసింద‌ని.. ఇది వారి దిక్కుమాలిన ప‌నితనానికి అద్దంప‌డుతోంద‌ని అన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోవ‌డం వ‌ల్లే ఆ సంస్థ ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఇది ఒప్పంద ఉల్లంఘ‌న అవుతుంది కాబ‌ట్టి మున్సిప‌ల్ శాఖ‌కు నోటీసులు జారీ చేస్తామ‌ని తెలిపింది.

ఇలాంటి కార్య‌క్ర‌మాలు హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మ‌రింత పెంచుతాయ‌ని యావ‌త్ ప్ర‌పంచం హైద‌రాబాద్ గురించి కూడా మాట్లాడుకుంటుంద‌ని ఈ సంద‌ర్భంగా KTR అన్నారు. తొలిసారి ఈ రేస్‌ను ఇండియాకు తీసుకొచ్చామ‌ని దానికి కాంగ్రెస్ నాశ‌నం చేసేసింద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేసారు. EVల‌కు సంబంధించి ఏవైనా ప‌రిశ్ర‌మ‌లు, పెట్టుబ‌డులు ఉంటే వాటిని హైద‌రాబాద్‌కు ఈ ఈవెంట్ ద్వారా తీసుకొద్దామన్న ఉద్దేశంతో రేస్ నిర్వ‌హించాల‌నుకున్నామ‌ని కానీ ఇప్పుడు కాంగ్రెస్ వ‌ల్ల ఆ అవ‌కాశం పోయింద‌ని అన్నారు.