KTR: త‌ప్పు రేవంత్ రెడ్డిది కాదు… మాదే!

KTR: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS పార్టీ కార్యకర్తల సమావేశంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పాల్గొని ప్రసంగించారు. 2023లో జ‌రిగిన తెలంగాణ ఎన్నిక‌ల్లో భార‌త రాష్ట్ర స‌మితి ఓడిపోవ‌డానికి కార‌ణం తామే అని.. తాము చేసిన మంచి ప‌నుల‌ను ప్ర‌జ‌ల‌కు స‌రిగ్గా చెప్పుకోలేక‌పోయామ‌ని అన్నారు.

“” ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 4 నెలల క్రితమే KCR అభ్యర్థిని ప్రకటించారు. ఆత్రం సక్కు ఇచ్చిన మాట ప్రకారం KCR ఆయనను ఆదిలాబాద్ అభ్యర్థిగా ప్రకటించారు. అధికారం పోగానే కొంతమంది వేరే దారులు వెతుకున్నా సరే…ఆత్రం సక్కు మాత్రం ఏ ప్రలోభాలకు లొంగలేదు. మంత్రి పదవులు, పెద్ద పదవులు చేసిన వారు అధికారం పోగానే పార్టీ నుంచి జారుకున్నారు. కానీ ఆత్రం సక్కు గారు మాత్రం విలువతో కూడిన వ్యక్తి. పార్టీ కష్టకాలంలో కూడా పార్టీతోనే ఉన్న నిజాయితీ గల వ్యక్తి. అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

రుణమాఫీ, రైతు భరోసా, ఇంట్ల ఇద్దరు ముసళోళ్లు ఉండే ఇద్దరికీ 4 వేలు ఇస్తా అంటూ డైలాగులు కొట్టి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి అన్న మాటను గుర్తు చేసుకోవాలె. డిసెంబర్ 9 నాటి ప్రమాణం స్వీకారాన్ని డిసెంబర్ 7 కే చేసిండు. అధికారమేమో రెండు రోజుల ముందే. రుణమాఫీ మాత్రం 4 నెలలైనా చేయలే. ఇప్పుడు ఆగస్ట్ 15 లోపు రుణమాఫీ చేస్తా అని కొత్త పాట ఎత్తుకున్నాడు.
రైతులు కర్ర కాల్చి వాత పెడతారన్న భయంతో కొత్త వాయిదా పెట్టిండు. రుణమాఫీ కావాలన్న, రూ. 2500 కావాలన్న, ముసలోళ్లకు రూ. 4 వేలు కావాలన్నా బీఆర్ఎస్ గెలవాల్సిందే. లేదంటే రేవంత్ రెడ్డి ఉన్న అన్ని పథకాలను ఇచ్చ కొట్టుడు ఖాయం.

లంకె బిందెలు ఉంటాయని అనుకొని వచ్చినా అంటాడు రేవంత్ రెడ్డి లంకె బిందెల కోసం తిరిగేటోళ్లు పచ్చి దొంగలు ఉంటారు. రైతు బంధు ఏమైందయ్యా అంటే ఓ మంత్రి చెప్పుతోని కొడుతా అంటాడు. కేసీఆర్ గారు 70 లక్షల మంది రైతుల ఖాతాలో రూ. 70 వేల కోట్లు రూపాయల జమ చేసిండు. రైతులు ఇప్పుడు చెప్పుతో కొట్టినట్లు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరముంది. KCR గారు ఉన్నప్పుడు కడుపు నిండా నీళ్లు, 15 రోజుల్లో పంట‌ కొనుగోళ్లు ఉంటుండె.

కాంగ్రెస్ వచ్చింది. కరువును తీసుకొచ్చింది. ఇవాళ‌ గ్రామాల్లో పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. గతంలో విష రోగాలు, అతిసారా అనే వ్యాధులు ఉండే. మిషన్ భగీరథ కార్యక్రమంతో కేసీఆర్ గారు మళ్లీ వాటిని లేకుండా చేశారు. మళ్లీ పాత రోజులను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ప్రజలు మోసపోవాలనే కోరుకుంటున్నారని రేవంత్ రెడ్డి నిజాయితీ చెప్పి మరి మోసం చేసిండు. తప్పు రేవంత్ రెడ్డి కాదు. మనదే. మనం చేసిన మంచి పనులను ప్రజలకు చెప్పుకోవటంలో విఫలమయ్యాం. లక్షా 63 వేల ఉద్యోగాలను మనం విద్యార్థులకు చెప్పుకోలేపోయాం. మన మీద జరిగిన విష ప్రచారాన్ని సరిగా తిప్పికొట్టలేకపోయాం.

ఇవి మన అందరి భవిష్యత్, పార్టీ భవిష్యత్ కు సంబంధించిన ఎన్నికలు. కాంగ్రెస్, BJP మీద ప్రజలు మంట మీద ఉన్నారు. మరి కష్టపడి పనిచేస్తే ఆదిలాబాద్ గెలవటం పక్కా. బీజేపీ, కాంగ్రెస్ చేసిన, చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించటమే మన పని. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిందా? మరి నోటిఫికేషన్ ఇవ్వకుండా మన ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. మంది పిల్లలను మా పిల్లలు అని చెప్పుకునే రకం కాంగ్రెస్ పార్టీ. ఏడాది లో 2 లక్షల ఉద్యోగాలిస్తామన్న కాంగ్రెస్ హామీని యువతకు మనం చెప్పాలె “” అని తెలిపారు KTR