Telangana Assembly: లాస్య నందితను తలుచుకుని KTR కంటతడి
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే KTR.. మొన్న ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన లాస్య నందిత గురించి తలుచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.
“” లాస్య నందిత భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని ఆశించాం.. కానీ ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికైన కొద్ది రోజులకే మరణించడం బాధాకరం. ఓ యువ శాసనసభ్యురాలు అనుకోని పరిస్థితిలుల్లో మరణించారు. కొన్ని సందర్భాలు దిగ్భ్రాంతిని కలిగిస్తాయి. 5 సార్లు గెలుపొందిన సీనియర్ ఎమ్మెల్యే సాయన్న మృదు స్వభావి. ఆయన అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు. కేసీఆర్ నాయకత్వంలో సాయన్న కంటోన్మెంట్ అభివృద్ధికి కృషి చేశారు.
సాయన్న, ముఠా గోపాల్ చిరకాల స్నేహితులు.. వారిద్దరి మధ్య దశాబ్దకాలంగా స్నేహం ఉంది. 2015లో జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు కవాడిగూడ నుంచి లాస్య నందితను కార్పొరేటర్‌గా చూడాలని ఉందని కేసీఆర్‌ను సాయన్న కోరారు. కేసీఆర్ కాదనకుండా.. ఆమెకు అవకాశం ఇచ్చారు. లాస్య నందిత కూడా గెలుపొందారు.
సాయన్న కుటుంబాన్ని చూస్తుంటే విధి పగబట్టిందేమో అన్న విధంగా ఉంది. సాయన్న, లాస్య నందిత ఒకే ఏడాదిలో దుర్మరణం చెందారు. ఇవి ఆవేదన కలిగించే అంశాలు. ఆ కుటుంబంలో ఎంతో విషాదం నెలకొంది. నందిత చలా చురుకైన అమ్మాయి. సాయన్న ఆరోగ్యం బాగాలేనప్పుడు.. ఇద్దరు కుమార్తెలు నందిత, లాస్య నివేదిత ఆయనతో ఎల్లవేళలా ఉండేవారు. ఇద్దరు అమ్మాయిలు కుడి ఎడమ భుజం మాదిరిగా ఉండేవారు.
ఇదే శాసనసభలో కేసీఆర్ సీఎంగా సాయన్న సంతాప తీర్మానం ప్రవేశపెట్టడమే కాకుండా ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. 2018 ఎన్నికల్లో లాస్య నందితకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. నందిత తన తండ్రి ఆశీస్సులతో మంచి మెజార్టీతో గెలిచింది. గెలుపొందిన కొద్ది కాలానికే నల్లగొండలో మా పార్టీ సభ జరిగితే వచ్చింది. ఆ రోజు ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. కారు ధ్వంసమైంది. ఆ తర్వాత లిఫ్ట్‌లో ఆమె ప్రమాదానికి గురైంది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో నందిత మరణించింది.
లాస్య నందిత మరణిస్తే తిరిగి వారి సోదరి నివేదితకు ఉప ఎన్నికల్లో అవకాశం ఇచ్చాం. దురదృష్టావశాత్తు ఆమె ఓటమి పాలైంది. మంచి విద్యార్హతలు కలిగిన లాస్య నందిత ఈ సభలో అడుగపెట్టిందని సంతోషించాం. భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని ఆశించాం. ఆమెకు సంతాపంగా మాట్లాడాల్సి వస్తుందని ఎవరూ ఊహించలేదు. సాయన్న కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చాం.. భవిష్యత్‌లో కూడా సంపూర్ణంగా అండగా ఉంటాం. ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాం “” అని KTR పేర్కొన్నారు.