KTR: రేవంత్.. మల్కాజ్‌గిరిలో తేల్చుకుందాం రా..!
భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ KTR.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (Revanth Reddy) సవాల్ విసిరారు. ఇద్దరం తాము గెలిచిన నియోజకవర్గాల్లో రాజీనామాలు చేసి మల్కాజ్‌గిరిలో పోటీ చేద్దామని పిలుపునిచ్చారు. ఇందుకు రేవంత్ రెడ్డికి ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి ఏ సభకు వెళ్లినా KTR గురించి ప్రస్తావించకుండా ఉండలేకపోతున్నారు. నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ సవాల్ విసురుతున్నారు. ఇటీవల జరిగిన ఓ సభలో రేవంత్ మాట్లాడుతూ.. నువ్వు మగాడివైతే లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచి చూపించు అని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. దానికి ప్రతి సవాల్‌గా KTR నువ్వు కొడంగల్‌లో రాజీనామా చెయ్.. నేను సిరిసిల్లలో రాజీనామా చేస్తా.. ఇద్దరం మల్కాజ్గిరి నుంచి పోటీ చేద్దాం. ఎవరు గెలుస్తారో చూద్దాం అని అన్నారు.
2018 తెలంగాణ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి కొడంగళ్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ప్రకటించారు. ఎన్నికల్లో రేవంత్ కొడంగళ్ నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. ఆయన చెప్పినట్లుగా రాజకీయ సన్యాసం తీసుకోకపోగా.. అవన్నీ ఏదో అలా అంటుంటాం అని మెల్లిగా ఎస్కేప్ అయ్యారు. 2023లో జరిగిన ఎన్నికల్లో రేవంత్ కొడంగళ్తో పాటు కామారెడ్డిలోనూ బరిలోకి దిగారు. ఈ రెండింట్లో కొడంగళ్‌లో పట్నం మహేందర్ రెడ్డిని ఓడించి భారీ మెజారిటీతో గెలిచారు. కామారెడ్డిలో ఓడిపోయారు.
ALSO READ: Uttam Kumar Reddy: నేడు మంత్రి.. రేపు ముఖ్యమంత్రి..!
ఇలాంటి ఛాలెంజ్‌నే 2016 ఎన్నికల సమయంలోనూ చేసారు రేవంత్ రెడ్డి. తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను అన్నారు. అప్పుడు ఓడిపోగా ఆయనకు ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలీలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కదా అని ప్రధాన ప్రతిపక్ష నాయకులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నంత కాలం ఎవ్వరూ కూడా ఇంతటి రేంజ్లో బిల్డప్‌లు ఇస్తూ సవాళ్లు చేయలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సవాళ్లు చేయడం.. నోటికొచ్చినట్లు మాట్లాడటం కాస్త ఎక్కువైపోయాయి.
వారు దిగిపోమంటే పోవాల్సిందే..!
రేవంత్ రెడ్డి ఏమీ సొంతంగా కష్టపడి తెలంగాణకు ముఖ్యమంత్రి కాలేదు. తెలంగాణ ఎన్నికల్ సమయంలో ఆయన స్టార్ క్యాంపెయినర్‌గా ఉండటంతో ఆయన కంటే సీనియర్ నేతలను పక్కన పెట్టి కాంగ్రెస్ హై కమాండ్ ముఖ్యమంత్రి సీటును కేటాయించింది. నిజానికి ఎన్నికలకు ముందే రేవంత్ రెడ్డికి హై కమాండ్ ఓ మాటిచ్చింది. తెలంగాణలో ఎలాగైనా గెలిచి తీరితే నిన్నే సీఎం చేస్తాం అని. అలా రేవంత్‌కు కలిసొచ్చింది. రేపో మాపో హైకమాండ్‌కు తిక్క పుట్టి రేవంత్ ముఖ్యమంత్రిగా పెత్తనం చేసింది చాలు.. ఇక మల్లు భట్టి విక్రమార్క కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు అని చెప్పారంటే మాత్రం రేవంత్ చచ్చినట్లు పదవి నుంచి తప్పుకోవాల్సిందే..!
అదీకాకుండా ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ హై కమాండ్ నుంచి పిలుపు వస్తుందా అని మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు వేచి చూస్తున్నారు. అందుకే ఎన్నికలకు ముందు KTR ఒక మాటన్నారు. ఎప్పుడూ కూడా స్థిరమైన నాయకత్వం ఉండాలని.. అలా ఉంటేనే ప్రజలకు సేవ చేయగలుగుతాం అని. అంతేకానీ.. గెలిస్తే సీఎం ఎవరు ప్రశ్న తలెత్తే పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి ఉండదని.. సీట్ల గురించి కొట్టుకోవడంతోనే ఐదేళ్లు గడిచిపోతాయని..!