KTR: చంద్రబాబు పెన్షన్లు పెంచారు.. మరి నీకేమైంది?
KTR: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లను పెంచారని.. మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతున్న సమయంలో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కావాలని కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెగ డిమాండ్ చేసిందని.. మరి ఇప్పుడు మూసీ సుందరీకరణకు ఎవరు ఆనందపడుతున్నారో.. ఎవరు మురిసిపోతున్నారో రేవంత్ చెప్పాలని అన్నారు. పథకాలను నెరవేర్చలేక రేవంత్ నాలుగు రోజులుగా మీడియా ముందుకు రావడమే బంద్ చేసారని… సోషల్ మీడియాలో ఎవరైనా అవినీతి గురించి ప్రశ్నిస్తే ఇతర నేతలు వచ్చి సమాధానాలు చెప్తున్నారు కానీ రేవంత్ మాత్రం మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నారని విమర్శించారు.
హైడ్రా వల్ల బాధితులు కోపంతో రేవంత్ రెడ్డిని తిడుతుంటే.. రూ.5000 కోసం రేవంత్‌ను తిడుతున్నారు అని దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారని.. ఆ ఒక్క మాటతో తనపై కాస్తో కూస్తో ఉన్న గౌరవం కూడా పోయిందని కేటీఆర్ అన్నారు. ఎన్నో ఏళ్లుగా రూపాయి రూపాయి దాచుకుని పర్మిషన్లు తెచ్చుకుని ఇళ్లు కట్టుకుంటే ఇప్పుడు హైడ్రా పేరుతో కూల్చేస్తామంటే తిట్టక దండం పెడతారా అని ప్రశ్నించారు. ఓటుకు నోటు దొంగ పక్క కూర్చుని కాస్త చదువుకున్న శ్రీధర్ బాబు కూడా చెడిపోయారని ఇది మంచిది కాదని అన్నారు. ఇప్పటికే హైడ్రా వల్ల ముగ్గురు చనిపోయారని.. ఆ బాధితులు తిడుతున్న తిట్లు వింటుంటే తనకే భయమేస్తోందని అన్నారు. పొరపాటున కాంగ్రెస్ నేతలు ప్రజల మధ్యలోకి వెళ్తే వాళ్లక ఏమన్నా జరిగితే తమ బాధ్యత కాదని అన్నారు.