Komati Reddy Venkat Reddy: సభకు ముందే వారిని కాంగ్రెస్‌లో చేర్చుకుంటాం
Komati Reddy Venkat Reddy: తెలంగాణ కాంగ్రెస్ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి KCR త్వరలో నల్గొండలో భారీ బహిరంగ సభను ఏర్పాటుచేయబోతున్నారు. ఆ సభ జరగడానికి ముందే BRS నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటామని వెంకట్ రెడ్డి సంచలనంగా మారింది. ఇటీవల గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి KCR.. ప్రతిపక్ష నేతగా భారీ బహిరంగ సభ ఏర్పాటుచేయనున్నారు. త్వరలో నల్గొండలో లక్షల మందితో సభను నిర్వహించనున్నారు. నీటి వాటాలో తెలంగాణకి కాంగ్రెస్ చేస్తున్న అన్యాయంపై ప్రజల్లోనే నిలదీయనున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఆ సభలు మొదలుకాకముందే BRS పార్టీ నేతలను తాము లాగేసుకుంటామని వెంకట రెడ్డి వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. BRS ఎంపీ వెంకటేష్ నేత రాజీనామా చేసారు. త్వరలో కేసీ వేణుగోపాల్‌ను కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. సరిగ్గా ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో BRS నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్తున్న తొలి సిట్టింగ్ ఎంపీ ఈయనే కావడం గమనార్హం. ఇటీవల తాటికొండ రాజయ్య (t rajaiah) కూడా రాజీనామా చేసారు. ఆయనకు మొన్న తెలంగాణ ఎన్నికల్లో తన సీటును కడియం శ్రీహరికి ఇవ్వడంతో ఆయన చాలా బాధపడ్డారు. అంబేడ్కర్ విగ్రహం వద్దకు వెళ్లి ఆయన పాదాలపై పడి మరీ ఏడ్చారు. KCR క్యాబినెట్‌లో రాజయ్య తొలి డిప్యూటీ సీఎంగా పనిచేసారు. ఆయన కూడా పార్లమెంట్ ఎన్నికలకు ముందు రాజీనామా చేయడంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.
ఇలాగే ఇంకొంత మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికలు (lok sabha elections) దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో గెలిచి తీరాలని BRS తీర్మానించుకుంది. మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన BRS ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు సాధించాలని అనుకుంటోంది. ఇందుకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సభలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించేస్తున్నారు. పార్టీ నేతల్లో ఉత్సాహం నింపేందుకు అతి స్వల్ప తేడాతో మాత్రమే ఓడిపోయామని ఈమాత్రం దానికి కారు షెడ్‌కు పోయిందని అనుకుంటే అది పొరపాటేనని చెప్తూ వస్తున్నారు. షెడ్‌కి వెళ్లిన కారు రిపేర్ అయ్యి డబుల్ స్పీడ్‌తో దూసుకు రాబోతోందని తెలిపారు.
ఈలోగా కాంగ్రెస్ మాయలో పడి పార్టీని వీడకండి అని KTR పరోక్షంగా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో BRS నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (revanth reddy) ఇతర పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసారు. ఇటీవల BRS మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (balka suman) రేవంత్‌ను రాయలేని భాషలో నోటికొచ్చినట్లు మాట్లాడారు. దాంతో ఆయనపై కేసు నమోదైంది. అప్పటి నుంచి బాల్క సుమన్ తప్పించుకుని తిరుగుతున్నారు అని తెలుస్తోంది. ఆయన కనిపిస్తే పోలీసులు ఏ క్షణానైనా అరెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.