Kishan Reddy: పార్టీ ఎంపీలు సోనియాకు ఊడిగం చేస్తారు
Kishan Reddy: ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, ఓవైసీ, KCR, రాహుల్ గాంధీ లాంటి వారు ఎంతమంది ఒక్కటై వచ్చినా మోదీ గెలుపును ఆపలేరని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీకి ఈ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్‌ఎస్‌కు ఎజెండా లేదని, ఆ పార్టీ పదేండ్ల పాలనలో అధికార దుర్వినియోగం, అహంకారం, అవినీతి చేయడంతోనే ప్రజలు బీఆర్ఎస్ ను తిరస్కరించారని తెలిపారు. అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. KCR అవినీతిపై ఎందుకు మౌనంగా ఉన్నదని ఆయన ప్రశ్నించారు.
BRS నాయకుల అవినీతి, అక్రమాలపై చార్జ్ షీట్ ఎందుకు వేయడం లేదో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ చరిత్ర ముగిసిందని, ఆ పార్టీకి భవిష్యత్ లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు దేశవ్యాప్తంగా ఇప్పుడున్న 40 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని.. తెలంగాణ ప్రజల ముందు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీయేనని అన్నారు. ఈ మేరకు బుధవారం కృష్ణమ్మ విజయ సంకల్ప యాత్ర నారాయణపేట, ధన్వాడ, దేవరకద్ర, కొత్తకోట మీదుగా మహబూబ్ నగర్ కు చేరుకున్నది. ఈ సందర్భంగా యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. ‘‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేదల, రైతుల, మహిళల పక్షపాతి. గత పదేండ్లలో చిన్న అవినీతి మరక లేకుండా దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారు. అందుకే మోదీ నాయకత్వాన్ని బలపరుద్దాం. మోదీని ఆశీర్వదించి ధర్మాన్ని, న్యాయాన్ని గెలిపించి అభివృద్ధిని ప్రోత్సాహిద్దాం”అని పిలుపునిచ్చారు. (Kishan Reddy)
17 సీట్లలో గెలుపే లక్ష్యంగా
తెలంగాణలో త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 17 సీట్లలో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నదని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఎజెండా లేదు. ఆ పార్టీకి ఒక్క సీటు రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం ఏమీ లేదు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అహంకారం, అవినీతి, కుటుంబ పాలన మాత్రమే చూశాం. కేసీఆర్ కుటుంబంపై బీఆర్ఎస్ పార్టీపై తెలంగాణలో విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి తమ ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరో కూడా తెలియదు. ఆ పార్టీ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో బీజేపీయే అత్యధిక సీట్లు గెలవబోతున్నది.
తెలంగాణలో కాంగ్రెస్ 3 సీట్లు గెలిచినా, ఢిల్లీని ఏమాత్రం ప్రభావితం చేయలేదు. మోదీ ప్రధాని కాకుండా రాహుల్, KCR, ఓవైసీలు ఎవరూ ఆపలేరు. అన్ని సామాజిక వర్గాల ప్రజలు మోదీ మూడోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనబడుతున్నది. కరెంట్ బిల్లులు, వ్యవసాయ రుణాల మాఫీ విషయంలో కాంగ్రెస్ మాట తప్పింది. ఆరు గ్యారంటీలు విషయంలో కాంగ్రెస్ మాట తప్పింది. సోనియా కుటుంబం మెప్పు కోసమే రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం పని చేస్తున్నది. కేసీఆర్ కూడా10 ఏళ్ల పాటు కుటుంబ పాలన మాత్రమే చేశాడు. తెలంగాణలో 17 సీట్లు గెలిచి, రాహుల్ ప్రధాని అయితే ఆరు గ్యారంటీలకు ఢిల్లీ నుంచి డబ్బులు తీసుకొస్తామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి అంటున్నాడు. ఎలా అమలు చేయాలన్న ఆలోచన లేకుండా ఆరు గ్యారంటీల హామీ ఇచ్చారు. (Kishan Reddy)
కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్, కర్నాటకలో కూడా బీజేపీకి అత్యధికంగా ఎంపీ సీట్లు రానున్నాయి. సోనియాకు ఎలా సేవ చేయాలని, సోనియాగాంధీ కుటుంబానికి సూట్ కేసులు ఎలా పంపాలని ఆలోచన తప్ప కాంగ్రెస్‌కు మరొకటి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ ఎలా చేస్తారో రైతుబంధు, నిరుద్యోగ భృతి ఏ విధంగా ఇస్తారో సమాధానం ఇవ్వాలి. పేద వర్గాలకు రైతులకు కావాల్సినవి అన్ని కూడా మోదీ ప్రభుత్వం అందిస్తున్నది. అన్ని వర్గాలకు మోదీపై ప్రగాఢ విశ్వాసం ఉంది. ఎవరితో బీజేపీ పొత్తు ఉండదు. తెలంగాణలో 17 సీట్లలో పోటీ చేస్తాం. మెజార్టీ సీట్లు గెలుస్తాం”అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ కార్యక్రమంలోని మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ యూనివర్సిటీస్ విభాగం కింద మహబూబ్ నగర్ లోని పాలమూరు యూనివర్సిటీకి రూ.100 కోట్లకు పైగా నిధులను మంజూరు చేశారని గుర్తు చేశారు.
నేతలతో భేటీ
విజయ సంకల్ప యాత్రలో భాగంగా నారాయణ పేటలోని నేతన్నలతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మోదీ ప్రభుత్వం నేతన్నకు అండగా ఉందని తెలిపారు. ప్రధాని మోదీ ప్రతి వారం చేనేత వస్త్రాలు ధరిస్తారని గుర్తు చేశారు. అనంతరం నారాయణ పేట చీరలు నేస్తున్న నేతకారులతో కలిసి సరదగా కాసేపు మగ్గం నేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చేనేత కార్మికుల కోసం ఈ ప్రాంతంలో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు కృషి చేస్తామని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేనేత కార్మికులకు ముద్ర రుణాల పేరుతో ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తోందని వివరించారు. వోకల్ ఫర్ లోకల్ నినాదంతో చేనేత ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తున్న మోదీ ప్రభుత్వం నేతన్నలకు అండగా ఉంటున్నదని తెలిపారు.
మేడారం జాతర సందర్బంగా శుభాకాంక్షలు
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ, తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన ‘సమ్మక్క సారక్క మేడారం జాతర’ ప్రారంభం సందర్భంగా ప్రజలందరికీ కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ జాతర భారతీయ సంస్కృతి, విలువలు, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని ఆయన గుర్తు చేశారు. సమ్మక్క, సారక్కల జీవితాలు, స్ఫూర్తిదాయకం, అన్యాయాలకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వారు సాగించిన పోరాటం నేటికీ ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ఓ సందేశంలో పేర్కొన్నారు. (Kishan Reddy)
కాంగ్రెస్ ఎంపీలు గెలిచినా వేస్టే..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయ సంకల్ప యాత్ర నారాయణ పేట పట్టణం నుంచి భారీ కన్వాయితో పెద్ద జేట్రం లింగంపల్లి, కొలంపల్లి మీదుగా ధన్వాడ పట్టణానికి చేరుకున్నారు. బీజేపీ శ్రేణులు కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికాయి. అనంతరం బైక్ ర్యాలీతో రోడ్ షోలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉత్సాహాన్ని నింపారు. యువత పెద్ద ఎత్తున హాజరయ్యారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా ధన్వాడ పట్టణంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వచ్చే ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు అని, దేశ ప్రధానిని నిర్ణయించే ఎన్నికలను, రాష్ట్ర ప్రజలు మోదీ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. కాంగ్రెస్, బీర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే దాన్ని మూసి నదిలో వేసినట్లేనని, ఏ మాత్రం తెలంగాణకు మేలు జరగదని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం ఏమీ లేదని, కాంగ్రెస్ కు ఒకటి రెండు సీట్లు వచ్చినా.. ఆ పార్టీ ఎంపీలు రాష్ట్రం కోసం ఢిల్లీలో చేసేదేమీ ఉండదని తేల్చి చెప్పారు.
మోదీకి ఒక్క రోజు సెలవు లేదు
సంకల్ప యాత్ర భారీ బైక్ ర్యాలీతో మరికల్, బండర్ పల్లి, రాకొండ, గూరకొండ మీదుగా దేవరకద్ర పట్టణానికి చేరుకున్నది. అక్కడ బీజేపీ శ్రేణులు యువత భారీ స్వాగతం పలికారు. దేవరకద్రలో రోడ్ షో నిర్వహించగా.. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. దేవరకద్రలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడారు. దేశానికి, ప్రజలకు ఎవరు మంచి చేస్తారో వాళ్లకే ఓటు వేయాలని ఆయన సూచించారు. ‘‘దేశ ప్రజల కోసం ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా మోదీ పనిచేస్తున్నారు. రైతు అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. దేశంలో ధరలను నియంత్రణలో ఉంచారు. సబ్సిడీలో రైతులకు ఎరువులు అందిస్తున్నారు. విద్యుత్ కోతలు లేకుండా చూసి వ్యవసాయ, పరిశ్రమ రంగానికి ఉతమిచ్చారు. దేశ భద్రతా వ్యవస్థను పటిష్టం చేశారు. ఆర్టికల్370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ ను ప్రశాంతమైన ప్రాంతంగా మార్చారు. (Kishan Reddy)
సర్జికల్ స్ట్రైక్ లతో పాక్ దేశానికి గట్టి సమాధానం చెప్పారు. కాంగ్రెస్ పాలనలో అన్ని కుంభకోణాలే. దేశాన్ని మెుత్తం కాంగ్రెస్ పార్టీ దోచుకున్నది. నరేంద్ర మోదీ అవీనితి రహిత పాలన కొనసాగిస్తున్నారు. దేశ ప్రజలే మోదీ కుటుంబ సభ్యులు. ప్రతి పేదవాడికి రూ. 5 లక్షల బీమాను అందించారు. 500 ఏండ్లుగా గుడిసెలో ఉన్న రాముడి కోసం అయోధ్య రామాలయాన్ని నిర్మించారు మోదీ. వచ్చే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరచి బీజేపీని గెలిపించాలని అందరిని కొరుతున్న”అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ 40 సీట్లు కూడా గెలుచుకోవడం కష్టంగా ఉందన్నారు. ‘‘తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీలను గెలిపిఇస్తే.. వారు సోనియాకు, రాహుల్ గాంధీకి ఉడిగం చేస్తారు తప్ప రాష్ట్రానికి ఏమీ ప్రయోజనం ఉండదు. తెలంగాణలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. అది కుటుంబ పార్టీ దాన్ని మరిచిపోవడమే ఇగ. తెలంగాణ అభివృద్ది కావాలంటే BJP బలపరచిన ఎంపీలు గెలవాలి. త్వరలోనే దేవరకద్రలో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మిస్తాం”అని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.
సమర్థ నాయకుడు దేశానికి కావాలి
అమ్మాపురం, మదనాపురం మీదుగా కొత్తకోట పట్టణానికి చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయ సంకల్ప యాత్రకు BJP నాయకులు, యువకులు స్వాగతం పలికారు. కొత్తకోటలో రోడ్ షో తర్వాత కిషన్ రెడ్డి మాట్లాడారు. ఏప్రిల్ మెుదటి వారంలో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయని, దేశానికి సమర్ధవంతమైన నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. ‘‘పేద కుటుంబంలో పుట్టిన.. సమర్థ నాయకుడైన మోదీ ఈ దేశానికి ప్రధాని కావాల్సిన అవసరం ఉంది. అవీనితి కాంగ్రెస్ పార్టీ గెలవకూడదు. మోదీకి అందరూ ఓటు వేయాలి. దేశంలో ప్రతి ఇంటికి టాయిలెట్ సౌకర్యాన్ని కల్పించారు మోదీ. పేద ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఏడాదికి రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించారు. ఆయిష్మాన్ భారత్ కార్డు ద్వారా ప్రతి పేదవాడు వైద్య సాయం పొందవచ్చు. పొదుపు సంఘాలకు రూ.20 లక్షల వరకు రుణాలను అందిస్తున్నారు. ఎలాంటి గ్యారంటీ లేకుండా అందరికి జీరో అకౌంట్‌లు ఓపెన్ చేసి ఇచ్చారు. మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేశారు. రైతుల సంక్షేమంపై మోదీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముద్ర లోన్స్ అందిస్తున్నది. పేదల ప్రజలకు పేవ చేసే బీజేపీకి మాత్రం ఉన్నది. రైతులకు ఆర్థిక సాయంతో పాటు గిట్టుబాటు ధరను మోదీ ప్రభుత్వం అందిస్తున్నది. ఎరువుల మీద ప్రతి ఎకరాకు మీద రూ. 18,000 సబ్సీడిని మోదీ ప్రభుత్వం ఇస్తున్నది. ఈ ఎన్నికల్లో భారీ మోజార్టితో నరేంద్ర మోదీని గెలిపించాలి”అని కిషన్ రెడ్డి కోరారు.
పాలమూరుతో BJPది విడదీయరాని బంధం
కృష్ణమ్మ విజయ సంకల్ప యాత్ర మహబూబ్ నగర్ కు చేరుకున్నది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ మహబూబ్ నగర్ జిల్లాలో అద్భుత జాతీయ రహదాలను నిర్మించింది. రైల్వేను కూడా అభివృద్ధి చేస్తున్నది. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం పాలమూరు యూనివర్సిటీకి వంద కోట్లు ఇచ్చింది. ప్రతి పేద వాడి ఇంట్లో టాయిలెట్, వంటగ్యాస్, బియ్యంతో పాటు పేదవాడి ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భారత్ పేరుతో బీమా పథకాన్ని తీసుకొచ్చి ఏడాదికి ఐదు లక్షలు ఇస్తూ పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నారు ప్రధాని మోదీ. పాలమూరుకు భారతీయ జనతా పార్టీకి విడదీయరాని అనుబంధం ఉన్నది. గతంలో ఇక్కడ చేసిన పోరు యాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీని, బీర్ఎస్ ను, TDPని ఓడించి ఇక్కడి ప్రజలు బీజేపీని గెలిపించారు”అని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
పాలమూరు బిడ్డలను ఎప్పటికీ మరువం
పాలమూరు బిడ్డలను ఎప్పటికీ మరువబోమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ పోరు యాత్ర తర్వాత తిరిగి మరోసారి కృష్ణా గ్రామం నుంచి కృష్ణమ్మ ఆశీస్సులతో మళ్లీ ఈ యాత్ర ప్రారంభించినట్లు చెప్పారు. ‘‘ప్రస్తుతం ఐదు ప్రాంతాల్లో యాత్రలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ప్రజలు యాత్రల్లో పాల్గొంటున్నారు. తిరిగి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి రావాలని కోరుకుంటున్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని దేశంలోని అన్ని వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి. ఇంట్లో టాయిలెట్ నుంచి మొదలుకొని చంద్రమండలంలోకి చంద్రయాన్ ను పంపే వరకు మోదీ ప్రభుత్వం కృషి ఎంతో గొప్పది. ఉచిత బియ్యం నుంచి మొదలుకొని రైతులను ఆదుకునే వరకు మోదీ ప్రభుత్వం పనితీరు ఏంటో చెప్పకనే చెబుతున్నది. దేశంలో ఉగ్రవాదులు మత కల్లోలాలు లేకుండా మోదీ ప్రభుత్వం చేసింది. పాకిస్తాన్ ఐఏఎస్ ఉగ్రవాదుల తోకలు కత్తిరించారు మోదీ. బాబర్ అనే మూర్ఖుడు రామ మందిరాన్ని ధ్వంసం చేస్తే 500 ఏళ్లుగా రాముడు గుడిసెలోనే ఉన్నాడు. మోదీ భవ్యమైన అయోధ్య రామ మందిరాన్ని నిర్మించి రాములవారిని ప్రతిష్టించారు”అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.